Friday, November 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురుణమాఫీ కోసం చేనేతల మహాధర్నా

రుణమాఫీ కోసం చేనేతల మహాధర్నా

- Advertisement -

భారీగా తరలి వచ్చిన కార్మికులు
సానుకూలంగా స్పందించిన సర్కార్‌
పోరాటాల తోనే సమస్యలకు పరిష్కారం : చెరుపల్లి సీతారాములు
మిగతా సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం : కమిషనర్‌ శైలజా రామయ్యర్‌
హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం
రూ. 33 కోట్ల రుణ మాఫీ విడుదల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణ మాపీ చేస్తామని హామీ ఇచ్చి 14నెలలు కావస్తున్నది. నేటికి ఆ హామీ అమలు కాలేదు..దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.స్వయంగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఎలా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల దగ్గర మిత్తీకి అప్పులు తెచ్చి రూ. లక్షకు ఆ పైన ఉన్న రుణాన్ని బ్యాంకు అధికారుల సూచన మేరకు తీర్చామనీ, అయినా హామీ మేరకు రూ.లక్ష రుణ మాఫీ కాలేదని కార్మికులు వాపోతున్నారు. ప్రయివేటు వడ్డీలు కట్టలేక, కొత్త రుణాలు తేలేక క్రమంగా ఉపాధి దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి పలు సార్లు విన్నపాలు చేసినా..అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నదని చెబుతున్నారు. కమిషనర్‌ కార్యాలయం ముందు మహాధర్నాతో పోరాటానికి శ్రీకారం చుట్టాలని భావించిన చేనేత కార్మికులు గురువారం హైదరాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయం ముందు మహా ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు భారీగా తలివచ్చారు. తమ ఆవేదనను కమిషనర్‌ ముందు వెళ్లబోసుకున్నారు. ‘చేనేత కార్మికుల రుణాలను వెంటనే మాఫీ చేయాలి. జియోటాగ్‌ ఉన్న చేనేత కార్మికులకు షరతులు లేకుండా భరోసా పథకం అమలు చేయాలి. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా చేనేత కార్మికుల వేతనాలు పెంచాలి’ అంటూ నినాదాలు చేశారు.

రూ. 33కోట్ల రుణమాఫీ విడుదల
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ.33కోట్లు విడుదల చేసిందని కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ప్రకటించారు. త్వరలో లబ్దిదారులకు చేరుతుం దని చెప్పారు. మిగిలిన వారికి కూడా తప్పకుండా మాఫీ జరుగుతుందని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. అన్ని సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతున్నదని చెప్పారు. నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నకిలీ వస్త్రాల తయారీ తదితర అంశాలను పరిష్కరించేందుకు తగిన విధంగా కృషి జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అంశాలను మరో సారి మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్‌ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌ మాట్లాడుతూ చేనేత ఇక్కత్‌ డిజైన్‌ను కొందరు నకిలీ ప్రింట్‌ చేసి చౌకగా అమ్ముతున్నారనీ, వాటిని అరికట్టటంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు.

సహకార వ్యవస్థ చేనేతకు గుండెకాయలాంటిదనీ, దాన్ని నిర్వీర్యం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికోక సారి చేనేత జాతీయ దినోత్సవాన్ని జరిపి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. వృత్తి రక్షణ కోసం పోరాటాలే మార్గమని చెప్పారు. చేనేత కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వనం శాంతి కుమార్‌, గంజి మురళీధర్‌ మాట్లాడుతూ పాలకులు ఎవరైనా చేనేత కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. సహాకారోద్యమ స్ఫూర్తి మంట గలిసే విధంగా 12 ఏండ్లనుండి చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా, సంఘాల క్యాష్‌క్రెడిట్‌ రుణాలు మాఫీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో పవర్‌లూమ్‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్‌, లక్ష్మి నర్సయ్య, శ్రీనివాస్‌, దేవదాసు, పాండు, వలీ, స్వామి, నరహరి, బడుగు శంకరయ్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

పోరాటాల తోనే సమస్యలకు పరిష్కారం : చెరుపల్లి సీతారాములు
చేనేతల బతుకులు, వారి బాధల గురించి ఇప్పటికే ప్రభుత్వానికి పలు మార్లు చెప్పామని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తెలిపారు. విన్నపాలు, విజ్ఞాపనలతో సమస్యలు పరిష్కారం కావనీ, రాజకీయాలకు అతీతంగా ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మగ్గాలు నేసేవారు, కష్టాలు అనుభవించే వారే ఈ ధర్నాలో పాల్గొన్నారని తెలిపారు. రుణమాఫీ అనుకున్న సమయంలో చేయకపోవటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల పాలవుతున్నారని తెలిపారు. పలు మార్లు సర్కారుకు మొరపెట్టుకున్నా..ఫలితం కనిపించనందున్నే ధర్నాకు పూనుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 50వేల చేనేత కుటుంబాలు మగ్గం మీద ఆధారపడి బతుకుతున్నారన్నారు.పని దొరక్క, దొరికినా తగిన విధంగా కూలి సరిపోక, వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండేండ్లకోక సారి కనీస వేతనాలను సవరించాలనీ, కానీ..ఏండ్ల తరబడి కనీస వేతనాల పెంపు ఊసే లేదని విమర్శించారు. సహకార సంఘాల ఎన్నికలు జరగకుండా నిర్లక్ష్యం వహించటంతో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలు అర్హులందరికి సక్రమంగా అమలు కావటం లేదన్నారు. కొర్రీలు, కోతలు లేకుండా ఆ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.నకిలీ సరుకు మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేయటం అన్యాయమన్నారు. ఆ ప్రభుత్వానికి చేనేతలంటే ఏమీ పట్టటం లేదని విమర్శించారు. ఎక్కడెక్కడో తిరిగి కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాం.. పారిశ్రామిక అధిపతులకు ఎన్నో వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తున్నాం.. కానీ..50వేల కుటుంబాలు వాళ్ల కాళ్లమీద వాళ్లు బతుకుతుంటే..వారికి ఎందుకు రాయితీలు ప్రకటించరని ప్రశ్నించారు. అనంతరం సంఘం నేతలు కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -