Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్‌ఐఏ దర్యాప్తు పేరుతో వేధింపులు ఆపాలి

ఎన్‌ఐఏ దర్యాప్తు పేరుతో వేధింపులు ఆపాలి

- Advertisement -

పౌర హక్కుల సంఘం డిమాండ్‌
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌

ఎన్‌ఐఏ రాష్ట్రంలో దర్యాప్తు పేరుతో మేధావులు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల నేతలపై వేధింపులకు పాల్పడుతున్నదని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పౌరహక్కుల సంఘం సీనియర్‌ నాయకులు, ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ మాట్లాడారు. ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 2018 నుంచి మొదలు పెట్టిన ఈ వేధింపుల పరంపర దేశ వ్యాప్తంగా నిరాటంకంగా.. రాజకీయ కక్ష సాధింపుగా కొనసాగుతున్నదన్నారు. గతేడాది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి, ఖాతా రామచంద్రారెడ్డిని ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కాల్చి చంపారని ఆరోపించారు. ఖాతా రామచంద్రారెడ్డి సొంత ఊరైన పెద్దపల్లి జిల్లా తీగల కుంటపల్లిలో అంత్యక్రియలు గత ఏడాది అక్టోబర్‌ 18న జరిగాయని తెలిపారు.

అక్కడ పురుగులు పడిన రామచంద్రారెడ్డి మృతదేహాన్ని చూసి సామాజికవేత్త గాదె ఇన్నయ్య భావోద్వేగంగా ప్రసంగించారని వివరించారు. దీంతో ఇన్నయ్య ప్రసంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మావోయిస్టు పార్టీకి అనుకూలంగా ఉందని, ఆయనను ఎన్‌ఐఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద.. ఉపా కేసుల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఎస్‌ఐఏ రాష్ట్రంలోని అనేక మంది మేధావులకు నోటీసులు పంపిందని తెలిపారు. వెంటనే గాదె ఇన్నయ్యను విడుదల చేయాలని, ఆయనకు పంపిన నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. భావ వ్యక్తీకరణ, వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛను కాపాడాలని కోరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావు, భరద్వాజ్‌, న్యాయవాది సురేష్‌ కుమార్‌, మాలతి, రాజా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -