Sunday, November 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకేసీఆర్‌ కండ్లకు గంతలు కట్టిన హరీశ్‌రావు

కేసీఆర్‌ కండ్లకు గంతలు కట్టిన హరీశ్‌రావు

- Advertisement -

ఆయన భూముల కోసమే త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు
ముగ్గురు బీఆర్‌ఎస్‌ నాయకులతో నష్టపోతున్న 56 మంది రైతులు
అన్నా..సోషల్‌మీడియాను వీడి బయటకు రా
మెదక్‌ జిల్లాలో అన్నీ సమస్యలే.. అందరూ పెద్ద నాయకులే : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
కేసీఆర్‌ కండ్లకు గంతలు కట్టి హరీశ్‌రావు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో శనివారం జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉండటంతో బీభత్సమైన అభివృద్ధి జరిగి నెక్ట్స్‌ న్యూయార్క్‌గా మారి ఉంటుందని అనుకున్నానన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాతే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అర్థమైందన్నారు. మెదక్‌ జిల్లాకు హరీశ్‌రావు ఉండగా ప్రజలకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. మహానాయకులు ఉన్నచోట అభివృద్ధి ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఊహించిన స్థాయిలో పని చేయలేదని, నిజంగా ప్రజల కోసం కష్టపడి ఉంటే ఫలితాలు పూర్తిగా వేరేలా వచ్చేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలోనే బీఆర్‌ఎస్‌ చురుకుగా కనిపించడం తప్పా గ్రౌండ్‌లో ఎలాంటి పని లేదన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌.. కృష్ణార్జునుల్లా సోషల్‌ మీడియాలో మునిగిపోయారని ఆరోపించారు. రామన్నా సోషల్‌మీడియాను వీడి ప్రజల సమస్యలపై పోరాడాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఫలితం చూశాకనైనా బీఆర్‌ఎస్‌ సరైన ప్రతిపక్షపాత్ర పోషించడం లేదని గ్రహించాలని హితవు పలికారు. కేసీఆర్‌ కండ్లకు గంతలు కట్టి హరీశ్‌రావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హరీశ్‌రావు అవినీతి బయటపెట్టినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీశ్‌రావుకు, సీఎంకు మధ్య ఏం ఒప్పందం ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హరీశ్‌రావు 400 ఎకరాల కోసమే త్రిబుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు..
రెడ్డిపల్లిలో 400 ఎకరాల హరీశ్‌రావు భూముల కోసం త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చారని కవిత ఆరోపించారు. రెడ్డిపల్లి, చిప్పలతుర్తి, తునికి గ్రామాల మధ్య హరీశ్‌రావుకు 400 ఎకరాల భూమి, అందులో ఫాంహౌస్‌ ఉందన్నారు. అదే విధంగా చిన్నచింతకుం టలో గంగుల కమలాకర్‌కు 15ఎకరాలు, నవీన్‌రావుకు 18 ఎకరాల భూమి ఉందని తెలిపారు. వారి భూములు అక్కడ ఉండటంతోనే అలైన్‌మెంట్‌ మార్చారని, నీటిలో పాముగా రింగులు రింగులుగా మార్చారని ఆరోపించారు. అదే విధంగా నర్సాపూర్‌ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి సంబంధించిన భవనంలో నిర్వహిస్తున్న హాస్టల్‌కు అద్దె కింద నెలకు రూ.లక్షా ఆరువేలు తీసుకుంటున్నాడని, అందులో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవన్నారు.

జాగృతి సంస్థ ప్రశ్నించే శక్తిగా ప్రజల వజ్రాయుధంగా మారుతుందన్నారు. ఆరేండ్లు జాగృతి సంస్థను నడిపానని, 20 ఏండ్లు బీఆర్‌ఎస్‌ కోసం పనిచేశానని, పార్టీ పెట్టటం కన్నా కూడా ప్రజల పక్షాన నిలబడటం ముఖ్యమన్నారు. అందులో భాగంగానే జాగృతి జనంబాట కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 2014కు ముందు తనకు ఎంత ఆస్తి ఉందో ఇప్పుడు అంతే ఉందని, తనలాంటి ఎంతో మంది ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలకు భవనాలు కట్టించాలని, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హమీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -