మతసామరస్యానికి భంగం కలిగించే ప్రసంగాలకు కట్టడి
గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు
ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వాధీనం
రోహిత్ వేముల చట్టం రూపకల్పనకు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం
‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’సహ పలు కీలక బిల్లులకు క్యాబినెట్ ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విద్వేషపూరిత ప్రసంగాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026)ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించింది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు పలు కీలక బిల్లులను ఆమోదించింది.
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ”తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) చట్టం-2026” బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్లు ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్ల రిజిస్ట్రేషన్‌తోపాటు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ బిల్లు ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతోపాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుందని తెలిపింది.
గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో ఆమోదించింంది. హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే చర్యలను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రుణభారం సహా మొత్తం రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం ఎల్ అండ్ టీకి చెల్లించి ఫేజ్-1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందనీ, ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించిందని తెలిపింది. ప్రభుత్వం తరపున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీలను నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్)కు అప్పగించింది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
న్యాయవాదులకు రక్షణ కల్పించే బిల్లు
తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించింది. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామనరావు హత్య నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.
ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మెన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసిందని తెలిపింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను మంత్రివర్గం చర్చించింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. 2024 నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ 25 వరకు 50 రోజులపాటు రాష్ట్రమంతా సర్వే జరిపింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను మంత్రివర్గ ఉపసంఘానికి మంత్రివర్గం అప్పగించింది.
విద్యాలయాల్లో కులవివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన ‘రోహిత్ వేముల చట్టం’ విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఉపసంఘం సభ్యులుగా మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు ఏది తక్కువైతే ఆ మొత్తం వారి వేతనాల నుంచి పరిహరించి తల్లిదండ్రులకు అందజేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తల్లిదండ్రుల మద్దతు బిల్లును మంత్రివర్గం ఆమోదించింది.
విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



