వలసొచ్చిన హదయం ఓ శోక శిల
కన్నీరింకిన ఎడారి, నీరు లేని నది, మోడుబారిన చెట్టు
వదిలి వచ్చిన మా వూరి గడ్డ మీద జీవం తొణికిసలాడేది
భూమి మీద మెరుపు మెరిసేది
వెలిగే జ్యోతి పైన విద్యుల్లత విరిసేది
మానేరు తీరం తీరొక్క తీరు ఆసరా అయ్యేది
ఆదివారపు ఉదయాన సత్యజిత్ రే నో శ్యాం బెనెగలో
కరచాలనం చేసేవారు
చాప్లిన్ కోసమో పాతనగరంలో పసివాడి కోసమో
పిల్లలు ప్రభాత్ భేరి మోగించేవారు
ఇప్పుడక్కడ క్లాక్ టవర్ గంటలు మోగించడం మానేసింది
కాన్ చీటీ పేరే మారిపోయింది
జంబాల్ గడ్డ, గోదాంగడ్డ, కారా?నాగడ్డ
తమ రూపాలనే మార్చుకున్నాయి
మొండి గోడల భవనాల నడుమ
అంతా దండిగా బతికేస్తున్నారు
అయినా వూరు ఇంకా కొన ఊపిరితో వుంది
తడి ఆరలేదు తపనింకా చావలేదు
ఇంతకూ నేను ఊరును వదిలి వచ్చానా
ఆ వూరే నన్ను వదిలేసిందా
వెళ్లి మంకమ్మతోటనో, హనుమాన్ నగర్నో అడగాలి
అందుకోసం మా వూరికి మళ్ళీ మళ్ళీ వెళ్లి రావాలి
- వారాల ఆనంద్