ప్రభుత్వానికి ప్రత్యేక మతం లేదు
దసరా ఉత్సవాలపై పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం బెంచ్
న్యూఢిల్లీ : జాతీయ ఐక్యతకు ప్రధానమైన ఆదర్శాలుగా లౌకికవాదం, ఆలోచనల్లో, విశ్వాసాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం మన రాజ్యాంగం పీఠికలో పొందుపరచబడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సుప్రీం కోర్టు పిటిషనర్‌కు సూచించింది. చాముండేశ్వరి ఆలయంలో చారిత్రక మైసూరు దసరా ఉత్సవాలను బుకర్ ప్రైజ్ విజేత, ముస్లిం అయిన బాను ముష్తాక్ ప్రారంభించాలని తాను కోరుకోవడం లేదంటూ బెంగళూరు నివాసి హెచ్.ఎస్.గౌరవ్ సుప్రీంను ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. భారత రాజ్యాంగం పీఠికను చదివారా లేదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అసలు రాజ్యాంగ పీఠిక అంటే ఏమిటి? అని జస్టిస్ నాథ్ పిటిషనర్‌ను ప్రశ్నించారు. దసరా ఉత్సవాలను బాను ముష్తాక్‌తో ప్రారంభించాలనుకోవడం ప్రభుత్వం తీసుకున్న కేవలం రాజకీయపరమైన చర్య అని పిటిషనర్ తరపు న్యాయవాది పి.బి.సురేష్ వాదించారు. హిందూయేతర వ్యక్తిని హిందూ మతపరమైన కార్యక్రమాల్లో ఎలా భాగం చేస్తారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 22న ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల్లో రెండు అంశాలు వున్నాయని, ఒకటి రిబ్బన్ కటింగ్, అది సెక్యులర్ కార్యక్రమమేనని, కానీ ఆ తర్వాత ఆలయ దేవతకు చేసే పూజ హిందూ మత ఆచారాతో కూడి వుంటుందని చెప్పారు. రాజ్యాంగంలోని 25వ అధికరణ (మతస్వేచ్ఛ) కింద ముఖ్యమైన మత ఆచారాల్లో భాగంగా హిందువే పూజ చేయాలని పిటిషనర్ వాదించారు.
కర్ణాటక హైకోర్టు కూడా ఈ కేసును సెప్టెంబరు 15న కొట్టివేసింది. బాను ముష్తాక్ ముస్లిం కమ్యూనిటీకి చెందినవారని, ఆమెను హిందూయేతర వ్యక్తిగా చూడకపోవడం తప్పని పిటిషన్ వాదించింది. అందువల్ల ఆమె హిందూ దేవత ముందు పూజలుచేయరాదని, అది హిందూ మత ఆచారాలకు, పద్దతులకు వ్యతిరేకమ ని స్పష్టం చేసింది. జస్టిస్ నాథ్ జోక్యం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వం సెక్యులర్‌గా వ్యవహరిస్తుందని, దానికంటూ ఒక మతం వుండదని 1994లో అయోధ్య చట్టం చెల్లుబాటుపై ఇస్మాయిల్ ఫరూకి కేసులో తీర్పు సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ”ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రయివేటు కార్యక్రమం కాదు. ఎ,బి లేదా సి మతాలంటూ ప్రభుత్వం తేడాలను గుర్తించదు.” అని జస్టిస్ నాథ్ నొక్కి చెప్పారు. బాను ముష్తాక్‌ను పూజలో భాగం కానివ్వబోమని ప్రభుత్వం హామీ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషనర్ కోరారు. ఆ డిమాండ్‌ను కోర్టు తోసిపుచ్చింది. కర్ణాటక ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబాల్ కోర్టు నిర్ణయాన్ని అభినందించారు. పిటిషన్‌ను తోసిపుచ్చుతూ కోర్టు ఇచ్చిన కారణాలను ప్రశంసించారు. లౌకికవాదం అనేది భారత రాజ్యాంగంలోని మౌలిక అంశమని గత తీర్పుల సందర్భంగా స్పష్టం చేసిన అంశాన్ని సుప్రీం కోర్టు మరోసారి గుర్తు చేసింది.