మోసం చేసిన కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
మనస్థాపంతో తల్లి తండ్రులు
నవతెలంగాణ – చిన్నకోడూరు
పింఛన్ కోసమని తల్లిదండ్రులను మోసం చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన మండల పరిధిలోని గోనెపల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెర్గు సిద్ధయ్య_ గాలవ్వకు ఇద్దరు కుమారులు మహేందర్, నగేష్, తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సిద్దయ్య తన పెద్దల ద్వారా 7 ఎకరాలు భూమిని వారసత్వంగా వచ్చింది. మూడున్నర ఎకరాలు రికార్డులో ఉండగా మరో మూడున్నర ఎకరాలు రికార్డులో లేదు. చిన్న కుమారుడు నగేష్ పేరున 1 ఎకరా 11 గుంటలు, సిద్దయ్య పేరున 2 ఎకరాల 5 గుంటలు రికార్డులో ఉన్నది.
జనవరి 24న చిన్న కుమారుడు నగేష్ తండ్రిని తనకు ₹4 వేల రూపాయల పింఛన్ ఇప్పిస్తానని తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి తన పేరు మీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడన్నారు. తన భూమిని తన చిన్న కుమారుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడన్న సంగతి నెల రోజుల తర్వాత తన బంధువుల ద్వారా తెలిసిందన్నారు. విషయం తెలిసిన రోజు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో తనను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఫిర్యాదు చేశామన్నారు.
తన పేరు మీద ఉన్న భూమి చిన్న కొడుకు రిజిస్ట్రేషన్ చేసుకుని పెద్ద పల్లిలో జీవనం కొనసాగిస్తున్నాడన్నారు. భూమిని దక్కించుకున్న కుమారుడు పట్టించుకోక, దక్కని పెద్ద కుమారుడు పట్టించుకోక పోవడంతో కొడుకులు ఉన్న మేము దిక్కులేని వార మయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ చేసి మమ్ములను ఆదుకోవాలని, లేకుంటే మాకు మరణమే దిక్కని కన్నీరు పెట్టుకున్నారు.



