Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహెల్త్‌ కార్డు ఉత్తర్వులు ఇవ్వాలి

హెల్త్‌ కార్డు ఉత్తర్వులు ఇవ్వాలి

- Advertisement -

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సంఘాలతో
సమావేశం ఏర్పాటు చేయాలి..సీఎస్‌కు టీజీఇజేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలనీ, హెల్త్‌ కార్డు ఉత్తర్వులు ఇవ్వాలని టీజీఇజేఏసీ కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవోలో భాగంగా ఇచ్చిన 243 ఉత్తర్వుల అమలు లో ఇంకా మిగిలిన స్పౌజ్‌ ఉద్యోగ ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలనీ, 244 మ్యూచ్వల్స్‌లో వివిధ కారణాల చేత ఆగిన వారికి కూడా అవకాశం ఇవ్వాలనీ, సాధారణ అంతర్‌ జిల్లా భార్యభర్తల బదిలీలు జరుపుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవకాశం ఇవ్వాలనీ వారు కోరారు. 190 ఉత్తర్వుల్లో రిటైన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, క్యాడర్‌ మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో 190 ఉత్తర్వులు అమలు చేయడంలో 25 జీఓ ( రేషనలైజేషన్‌ ) ఉత్తర్వులు అమలు చేస్తున్నందున ఖాళీలు చూపెట్టడం లేదనీ, దీనిపై ఒకసారి సమీక్షించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీపీవో, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలనీ, ముఖ్యంగా జీపీవో జీతభత్యాల విషయంలో జాప్యం నివారించేందుకు వీలుగా క్యాడర్‌ స్ట్రెంత్‌, హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ నిర్ణయం చేసి ఆర్థిక శాఖ ద్వారా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎస్‌ మాట్లాడుతూ త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నింటిని పరిశీలిస్తానని తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పుల్గం దామోదర్‌ రెడ్డి, ముజీబ్‌ హుస్సేన్‌, ఎ. సత్యనారాయణ, బి.శ్యామ్‌ , గోల్కొండ సతీష్‌ , శ్రీరామ్‌ రెడ్డి, గండూరి వెంకట్‌, నిరంజన్‌ రెడ్డి, షౌకత్‌ హుస్సేన్‌, శ్రీకాంత్‌, సుజాత తధితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -