Friday, February 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమట్టికి 'ఆరోగ్య పరీక్షలు '

మట్టికి ‘ఆరోగ్య పరీక్షలు ‘

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆగిన భూసార పరీక్షలు
మట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు : రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరామిరెడ్డి


నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
మట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు అని, వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, ఈ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండ రామిరెడ్డి తెలిపారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూర్‌ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో రైతు కమిషన్‌ బృందం రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరామిరెడ్డి నేతృత్వంలో కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్‌ వంశీకృష్ణ పర్యటించారు. రైతు వేదిక వద్ద రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగ విధానం, సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు.

అనంతరం మినీ కిట్ల పంపిణీ, భూసార పరీక్షలకు సంబంధించిన పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. పంటల అభివృద్ధి, అధిక దిగుబడుల సాధనలో మట్టి పరీక్ష అత్యంత కీలకమని కోదండరామిరెడ్డి అన్నారు. రైతులు పంటలు విత్తే ముందు తప్పనిసరిగా తమ భూముల మట్టి పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. సరైన ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ తగిన పంటల ఎంపిక చేయడం సులభమవుతుందని అవసరానికి మించి ఎరువులు వేయడం వల్ల రైతులకు ఆర్థిక నష్టం కలగడంతో పాటు భూమి సారంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు. రైతులు ప్రభుత్వ వ్యవసాయ విభాగం ద్వారా అందుబాటులో ఉన్న మట్టి పరీక్ష సేవలను వినియోగించుకోవాలన్నారు.

దూరదృష్టితోనే హరిత విప్లవానికి బలమైన పునాదులు : అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
దేశ వ్యవసాయ రంగ అభివృద్ధిలో తొలి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కీలక పాత్ర పోషించారని, దూర దృష్టితోనే హరిత విప్లవానికి బలమైన పునాదులు పడినట్టు తెలిపారు. నేడు దేశంలో రెండు సంవత్సరాలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు ఉండటం ఆయన చేపట్టిన విధానాల ఫలితమేనని అన్నారు. ముఖ్యంగా శ్రీశైలం డ్యాం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టుల నిర్మాణం వ్యవసాయ రంగానికి బలాన్ని ఇచ్చాయని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు.

కార్యక్రమంలో నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ ,రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యులు కేవీ నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్‌, మరికంటి భవానీ రెడ్డి, భూమి సునీల్‌ , రాంగోపాల్‌ రెడ్డి రాములు నాయక్‌, గంగాధర్‌ ,గ్రామ సర్పంచ్‌ మల్లేపల్లి వెంకటేష్‌, రైతు సంక్షేమ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ గోపాల్‌, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు సుచిత్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సంధ్యారాణి, వ్యవసాయ ప్రధాన సైంటిస్ట్‌ డాక్టర్‌ బ్రజేంద్ర, డాక్టర్‌ రాంప్రకాష్‌, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌ రావు, వ్యవసాయ అధికారులు రేవతి, చంద్రశేఖర్‌, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -