Monday, February 2, 2026
E-PAPER
Homeదర్వాజగుండెల్ని తాకే అంతర్ధ్వని 'స్పర్శ లేని శిల'

గుండెల్ని తాకే అంతర్ధ్వని ‘స్పర్శ లేని శిల’

- Advertisement -

”స్పర్శ లేనిశిల” ఈ గ్రంథం కేవలం పదాలతో నింపబడిన పుస్తకం మాత్రమే కాదు, భావోద్వేగాల గాధలు, మానవీయతకు అద్దం పట్టే కవితా ప్రవాహం. ఒక విలక్షణ సాహిత్య కృషి ప్రతి పాఠకుని లోతుల్లోకి ప్రవేశించే అక్షర సంపద ఇది. లహరి ఓ సున్నితమైన హృదయం, ఓ ఆత్మాన్వేషణలో నిమగమైన కవయిత్రి. ఆమె కలం నుండి జారే ప్రతి అక్షరం, ఒక్కో కన్నీటి చుక్కలా గుండెని తడుపుతుంది. మరొకసారి, మనలో దాగి ఉన్న ఓ మౌనాన్ని మాటలుగా మలుస్తుంది. ఆమె కవితల్లోని మానవత్వం తడికి, ప్రతి ఒక్కరి గుండె కరిగిపోవాల్సిందే. ఆమె స్పటికం లాంటి చల్లని మనసుకు సాక్షిగా, ప్రతి కవితా పంక్తి మనల్ని ఫిదా చేస్తుంది.

ఇప్పటికే ఆమె రచించిన ‘అక్షర నేత్రాలు’ మనం చూడలేని జీవితాన్ని చూపించింది. ‘నానీల తీరాన’ అనే కవితా సంపుటి, సూక్ష్మమైన భావాలను చిన్న వాక్యాల్లో నిక్షిప్తం చేసింది. ఇప్పుడీ ‘స్పర్శలేని శిల’ పేరులోనే ఎమోషన్‌ ఉంది. ‘స్పర్శ లేనిశిల’… స్పర్శలేనిదై మౌనంగా నిలుచున్నా, మన గుండెను తాకే అంతర్ద్వని! ఈ పుస్తకం పఠితుల్లో ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఆత్మను తరిచి చూసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది ఒక్క కవయిత్రి విజయమే కాదు, మన సమస్యల సందోహంతో సతమతమవుతున్న సమాజానికి ఓ అద్భుతమైన సందేశం. ఈ కాలంలో కూడా, భావోద్వేగాల గొంతును వినిపించే వారుంటారంటే, అది లహరి లాంటి వారి వల్లే.. లహరి సమాజంలోని అతివల అణిచివేతను, ఆవేదనను తెలియజేస్తూనే వాటన్నింటిని అధిగమించి స్త్రీ నేటి సమాజంలో ఎలా పురోగమిస్తుందో వెల్లడి చేస్తుంది.

”ఒకప్పుడు నాలుగు గోడలకు పరిమితమైన ఆమె అంతులేని ఆకాశంలో రేయింబవళ్లు వెలుగుదివ్వై ప్రకాశిస్తోంది! అవమానాల కట్టుబాట్లను తెంచుకొని ఆత్మగౌరవ పతాకమై రేపరెపలాడుతోంది! ఇంటి గుమ్మంలో రంగవల్లికలను దిద్దిన ఆమె స్వాభిమాన వినువీధుల్లో ఇంద్రధనస్సు రంగుల్ని వెదజల్లుతోంది!” పురుషాధిక్యత కబంధహస్తాల నుంచి తనను తాను పునర్నిర్మించుకుంటూ ఎలా వినువీధులను స్పృశిస్తుందో అద్దం పడుతుంది ఈ ‘వెలుగు దివ్వె’ కవిత. స్త్రీ ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాలలో పురోగమిస్తూ అంచలంచలుగా ఎదుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పటికీ అడుగడుగునా ఆమెకు పొంచి ఉన్న ప్రమాదాలను గురించి పసి వయసు నుంచి పండు ముదుసలి వరకు ఎన్నో రకాలుగా పురుష భావజాలానికి బలైపోతూ నలిబిలి అవుతున్న విషయాన్ని అత్యంత హృదయ విదారకంగా వర్ణిస్తుంది ‘వరకట్నపు విష బీజం’ కవిత.

స్పర్శ లేని శిల ఎన్నెన్నో భావోద్వేగాల వ్యక్తీకరణల సమాహారం. మరెన్నో హృదయానుగతమైన భావాల సమ్మేళనం.. ”నువ్వు ఎదిగే క్రమంలో గుంట నక్కలు ఈలలేస్తూ వెంటపడతాయి. చిత్తకార్తె కుక్కలు చొంగ కార్చుతూ అదనుకై వేచి చూస్తాయి.. ఇగో ఎదురు తిరిగే స్ఫూర్తిని నూరిపోస్తున్న ధైర్యమనే రాయిని నీ చేతికిస్తున్న. రక్షక భటురాలివై మగువలను భక్షించగ చూసిన దుష్టులను శిక్షించు” అంటూ గుండె నిండుగా ధైర్యాన్ని నూరిపోస్తుంది ‘తంగేడు పూలు’ కవితలో. ‘ఆమె ఓ జీవనది’ లో మగువ ఔన్నత్యాన్ని, ఆమె పోరాటపటిమను నాలుగు మాటల్లో తేల్చేస్తుంది. ”ఆమె మమ్మల్నందరినీ పిల్ల కాలువలా కలిపేసుకుంటూ కుటుంబ ప్రవాహమై ఉరకలెత్తే మహానది!” అంటూ గెలుపు కోసం చేసే ప్రయత్నంలో చిన్న ఆటంకాలు వచ్చినా కృంగిపోయి ప్రయత్నాన్ని విరమించుకోవద్దు అని చెబుతూ ”శిశిర బాధలన్నీ రాలిపోయాక నవవసంతమై జీవితం/ మళ్ళీ చిగురులు తొడగాలి గెలుపు వైపు సాగే పయనంలో/ కాస్తంత కష్టానికే దిశ మార్చుకోవద్దు కృంగిపోయింది ఇక చాలు” అంటూ అలుపెరుగని కృషి చేయాలని ఆత్మస్థైర్యం నింపుతుంది ‘నవవసంతం’ కవితలో. సృష్టి చిత్ర విచిత్ర విన్యాసాల్లో అలుపెరుగని ప్రయాణమే మానవ జన్మకి అంతిమ ప్రస్థానం!

ఇప్పుడు అరుగులన్నీ కనుమరుగయ్యాయి మనుషుల్ని మనుషులతో హత్తుకొని మాట్లాడే రోజులు ఏనాడో వలస పోయాయి. దూరమైన తీపి గుర్తుల జాబితాలో అంతరించిన ఇంటి స్మతులు ఇప్పటికీ ఓ జ్ఞాపకగానే మిగిలిపోయాయి. తన జీవిత భాగస్వామి తన సర్వస్వం అయినా పతిదేవుడిని తలుచుకుంటూ ‘నా జీవన ప్రేమమయి’ చెప్పారు. ”అంతులేని ప్రేమను పంచావు!/ నా రెక్కల్ని విదిల్చినప్పుడల్లా ఎగిరేటంత స్వేచ్ఛనిచ్చావు/ అందుకే నువ్వు ఒక గగనానివి/ నా భవిష్యత్తు ఆశాకిరణానివి!” అంటూ పొగడ్తలలో ముంచేస్తుంది. తన జీవితంలో అనివార్యంగా లభించిన విరామ సమయాన్ని గురించి ఆర్ద్రంగా చెబుతూ ”అతి తొందరలో నా కాళ్లు తిరిగి లేచి ఈ నేలతో మళ్ళీ యుద్ధం చేస్తాయి/. ప్రకతి గాలి ఔషధమై నాలో కొత్త ఊపిరిని నింపుతుంటే/ స్వేచ్ఛగా మళ్లీ ఎగిరెల్లిపోయే రోజులు వస్తాయి/ ప్రస్తుతానికి ఇదొక విరామ సమయం మాత్రమే..” అంటూ, విరామ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది.

సాంకేతికంగా ఉన్నత శిఖరాలను అందుకున్నామని, కృత్రిమ మేధను కొత్త పుంతలు తొక్కించామని చంకలు గుద్దుకుంటున్న సమాజంలో ఇంకా స్త్రీల తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ”ఆమె నిద్రిస్తోంది తరాలు మారినా తరతరాలుగా మారని దేశ దౌర్భాగ్యానికి ప్రతీకగా../ ఏదో ఒకచోట చిత్రవధకు గురవుతూ శాశ్వత నిద్రలోకి జారిపోతోంది”. ఏదో సాధించామని చంకలు గుద్దుకుంటున్న సమాజంపై కాండ్రించి ఉమ్మేస్తూ జనం చేవచచ్చిన తనానికి సాక్షంగానో రుజువుగానో మిగిలిపోతుంది అంటూ అంతర్గత వేదనను వెళ్ళగకుతుంది ‘రక్తసి మూక రగిలించిన కాష్టం’లో.
చివరి కవిత ‘ఉప్పెనలోంచి ప్రవాహం’లో జీవిత అంతిమ సత్యాలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.

”ప్రేమను పంచడానికి సప్త సముద్రాలు దాటనవసరం లేదు./ అనుబంధాల మధ్య ఆప్యాయతల్ని చిగురింపచేయడానికి మానవత్వం తొణికిసలాడే మనిషిగా నిలబడితే చాలు/ మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు/ మహోన్నత వ్యక్తిగా చివరిదాకా మిగిలిపోతావు” అంటూ ముగిస్తుంది. లహరి గొప్ప భావుకురాలే కాదు. సమాజం పట్ల తనకంటూ కొన్ని దృక్పథాలు, అభిప్రాయాలు ఉన్న ఆలోచన శీలి. తరాలు మారినా మారని స్త్రీల తలరాత గురించి ఆమె దిగులు, ఆవేదన ఈ కవితా సంపుటిలోని చాలా కవితలలో వ్యక్తం అవుతూ ఆమెను ఒక స్త్రీవాద రచయిత్రి కోణంలో చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. చిరు వయసులోనే అద్భుతమైన కవితలను విరచించిన లహరి కలం మరింత పదునెక్కాలంటే నిరంతర అధ్యయన శీలత, సమాజాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించే గుణం ఉంటే సరిపోతుంది.. దానికి అనుభవం కలగలిపితే మెరికల్లాంటి కావ్యాలను సృష్టించగలదు. ఆమెకు నా ప్రేమ పూర్వక అభినందనలు..

  • డాక్టర్‌ మామిడాల శైలజ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -