Tuesday, November 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుహృదయ విదారకం..

హృదయ విదారకం..

- Advertisement -

పలువురి కంటతడి
పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను అప్పగించిన వైద్యులు
చేవెళ్ల ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు
బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు


నవతెలంగాణ- చేవెళ్ల
చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. దీంతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ఇది చూసిన వారంతా కంటతడి పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసేందుకు ఉస్మానియా ఆస్పత్రి నుంచి వైద్యులను చేవెళ్లకు తీసుకొచ్చారు. పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

ఆ ప్రాంతమంతా రోదనలతో నిండిపోయింది. వెళ్లొస్తానని చెప్పి కనబడకుండా పోయారని ముగ్గురు కూతుళ్లను పోగొట్టుకున్న ఓ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఫోన్‌ కొనుక్కునేందుకు ఇంటికి వచ్చి మరో యువతి ప్రాణం పోగొట్టుకుంది. తల్లి మృతి చెందడం, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో వారి పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. మా నాన్న ఎక్కడంటూ ఆ చిన్నారులు ఏడుస్తూ అడుగుతుండడంతో అక్కడ ఉన్నవారు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. మరో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ఈ ప్రమాదంలో గర్భిణితో పాటు పది నెలల పసిపాప చనిపోయిన తీరును చూసి అక్కడ ఉన్నవారంతా కంటతడిపెట్టారు.

ఘటన బాధాకరం : స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విచారకరమని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రాంమోహన్‌రెడ్డి, మనోహర్‌ రెడ్డి, ఆయన కుమార్తె గడ్డం అనన్యతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు.. ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్టు చెప్పారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.

కేసు నమోదు : సీపీ అవినాష్‌
ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్టు సీపీ అవినాష్‌ మొహంతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్టు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నామని సీపీ తెలిపారు. మరణించిన వారిలో 18 మంది తాండూరు చేవెళ్ల వాసులేనని అన్నారు. చనిపోయిన టిప్పర్‌ డ్రైవర్‌ను ఆకాశ్‌గా గుర్తించామన్నారు. అయన మహారాష్ట్ర వాసి. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన లచ్చానాయక్‌ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. టిప్పర్‌ వాహనం పటాన్‌చెరు క్రషర్‌ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రజాప్రతినిధులకు నిరసన సెగ
ప్రమాదం జరిగిన చోటుతో పాటు ఆస్పత్రి వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, పార్టీ నేత శుభప్రద్‌ పటేల్‌కు నిరసన సెగ తగిలింది. ప్రమాద బాధితులను వారు పరామర్శించడానికి వచ్చారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబ సభ్యులు వీరిని ప్రశ్నించారు. ’15 ఏండ్లు మంత్రిగా ఉండి, ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. ఎందుకు చూడడానికి వచ్చారు’ అంటూ సబితా ఇంద్రారెడ్డిని నిలదీశారు.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు బాధితులపై దాడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబ సభ్యులను నిలువరించారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ మీర్జాగూడ వద్ద యాక్సిడెంట్‌ స్పాట్‌ ఉందన్నారు. అక్కడ మలుపు ఉండడం, చెట్లు తొలగించకుండా, రోడ్డు పనులు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆస్పత్రికి వచ్చిన ఎంపీపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కాలె యాదయ్యను..
ఘటనా స్థలానికి పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను అక్కడున్న ప్రజలు అడ్డుకొని వెళ్లగొట్టారు. ‘ఇక్కడికి రావద్దు.. నీ వల్లనే ఇక్కడ రోడ్డు విస్తరణ ఆలస్యమైంది.’ అనడంతో ..ఆయన అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

మంత్రుల పరామర్శలు..
విచారణకు ఆదేశించాం.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా : మంత్రి పొన్నం ప్రభాకర్‌
బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగ్రాతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 19 మంది మృతిచెందినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షలు చెల్లిస్తామన్నారు. అలాగే మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఘటనా స్థలాన్ని ఫైర్‌ శాఖ డీజీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి విచారణ తరువాతే తెలు స్తాయని ఆయన మీడియాతో చెప్పారు. సీపీ మహేష్‌ భగవాత్‌ సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు.

ఫోన్‌ కోసం ఇంటికొచ్చి…
యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ గ్రామానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని అఖిల ప్రియారెడ్డి ఈ బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ఈమెకు ఆదివారం సెలవు ఉండడంతో శనివారం రాత్రి సొంత గ్రామానికి కొత్త ఫోన్‌ కొనుక్కోవడానికి వచ్చింది. తిరిగి సోమవారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్సెక్కింది. ఈ బస్సు బయలుదేరిన తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పింది. ఇంతలోనే ప్రమాదంలో మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

అత్తాకోడళ్లు మృతి
హైదరాబాద్‌ బోరబండకు చెందిన గోగుల గున్నమ్మ, కల్పన అత్తాకోడళ్లు. వీరు తాండూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

దిక్కుతోచని స్థితిలో చిన్నారులు…..
తాండూరు బృందావనీ కాలనీకి చెందిన అబ్దుల్‌ మజీద్‌ భార్యా పిల్లలతో తాండూరు నుంచి హైదరాబాద్‌ ఆస్పత్రికి వస్తున్నాడు. ప్రమాదంలో భార్య మృతి చెందింది. ఆయన చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారి పిల్లలను బస్సులో నుంచి బయటకు తీశారు. వారు తమ తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ప్రమాద స్థలిలో కూర్చుండి పోయారు. వీరి ముగ్గురు అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితిలో పడ్డారు. వచ్చిపోయే వారిని చూస్తూ ఉండిపోయారు.

తల్లీబిడ్డా మృతి.. కంటతడి పెట్టించిన దృశ్యం
ప్రమాదంలో ఓ తల్లీబిడ్డా మృతిచెందారు. తాండూర్‌కు చెందిన సెలెహ బేగంతో పాటు ఆమె కూతురు జహీరా ఫాతిమా(40 రోజుల బేబి) మృతిచెందారు. బస్సులో నుంచి తల్లీబిడ్డ మృతదేహాలను బయటకు తీసి రోడ్డుపై ఉంచడంతో ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు కన్నీరుపెట్టుకున్నారు. అలాగే సెలెహబేగం తండ్రి కూడా ఈ ప్రమాదంలో మరణించారు.

అనాథలైన చిన్నారులు
వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం హాజీపూర్‌ గ్రామానికి చెందిన భార్యాభర్తలు లక్ష్మి, బంధయ్య ప్రమాదంలో చనిపోయారు. లక్ష్మీకి బాగా లేదని హైదరాబాద్‌ ఆస్పత్రికి వెళ్తున్నారు. ప్రమాదంలో చనిపోవడంతో వీరి ఇద్దరు పిల్లలు శివనీల, భవాని(4వ తరగతి) అనాథలు అయ్యారు. ఘటనాస్థలిలో నిర్జీవంగా పడి ఉన్న తమ తల్లిదండ్రులను చూసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారుల రోదనలు మిన్నంటాయి. వీరికి భూమి లేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి….
తాండూరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్యగౌడ్‌కు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఇటీవల ఒక కుమార్తె వివాహం చేశాడు. ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్‌), సాయిప్రియ (డిగ్రీ థర్డ్‌ ఇయర్‌), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇటీవల బంధువుల పెండ్లి ఉండటంతో ఈ అక్కాచెల్లెళ్లు సొంతూరుకు వచ్చారు. వీరికి కోఠి ఉమెన్స్‌ కాలేజీలో పరీక్షలు ఉండడంతో హైదరాబాద్‌కు వచ్చారు. తాండూరులో ఎల్లయ్యగౌడ్‌ వీరిని బస్సు ఎక్కించాడు. ప్రమాదంలో తన ముగ్గురు కూతుళ్లూ చనిపోవడంతో ఎల్లయ్యగౌడ్‌ గుండెలు పగిలేలా విలపించాడు. రావొద్దని చెప్పినా వచ్చారని రోదించాడు.

ప్రమాదానికి కారణాలను ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం: మంత్రి దామోదర
రోడ్డు ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పీఎంఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. బస్సు కండక్టర్‌ రాధతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ఒక్కరికి మాత్రమే తలకు దెబ్బ తగిలిందని, మిగిలిన పేషెంట్లందరి పరిస్థితి బాగుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -