Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -

– రోడ్లపై వరదలో మునిగిపోయిన వాహనాలు
– పెద్దఎత్తున ట్రాపిక్‌ జామ్‌
– హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం
నవతెలంగాణ- విలేకరులు

హైదరాబాద్‌ నగరంలో భారీ కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం నుంచి మొదలై రాత్రి వరకు కురుస్తూనే ఉంది. నగర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. పలు ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాలు వరదలో మునిగిపోయాయి. యూసుఫ్‌గూడలో వరదనీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జూబ్లీహిల్స్‌ టు యూసుఫ్‌గూడ రోడ్డు పూర్తిగా బ్లాక్‌ అయింది. చాలా వరకు వాహనాలు, బైకులు వరద నీటిలో మునిగిపోయి దెబ్బతిన్నాయి. వాహనవారులు ఈ మార్గం నుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లాలని పోలీసులు, అధికారులు సూచించారు. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ కింద మోకాళ్ల లోతు వరద నీరు చేరుకుంది. ఖైరతాబాద్‌ నుంచి జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, మియాపూర్‌- లింగంపల్లి మార్గాల్లో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికే ఎమర్జెనీ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌, హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగమయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడికక్కడా వాహనాలను క్లియర్‌ చేసే పనిలో ఉన్నారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే పనుల్లో ఆ శాఖ అధికారులు నిమగమయ్యారు.
కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, మధురానగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్‌, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సైబర్‌ సిటీ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద అత్యధికంగా 123.5మి.మీ. వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది. శ్రీనగర్‌ కాలనీలో 111.3 మి.మీ., ఖైరతాబాద్‌లో 108.5 మి.మీ. యూసఫ్‌గూడలో 104.0 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
నిండుకుండలా హిమాయత్‌సాగర్‌
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు చోట్ల వర్షపు నీరు ఇండ్లల్లోకి చేరింది. హిమాయత్‌సాగర్‌కు వరద ప్రవాహం పెరిగింది. ఏ క్షణంలోనైనా గేట్లు తెరిచి దిగువన మూసీలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad