Wednesday, December 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికేంద్రం గుప్పిట్లోకి ఉన్నత విద్య

కేంద్రం గుప్పిట్లోకి ఉన్నత విద్య

- Advertisement -

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వాటి స్థానంలో ప్రయివేటు, కార్పొరేట్‌రంగాలకు అనుకూలించే వ్యవస్థలను ప్రవేశపెడుతూ వస్తున్నది. ఈ పరంపరలో ఉన్నతవిద్య నియంత్రణ కోసమంటూ నూతన చట్టం తేబోతున్నది. ఇందుకు 1952లో ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చట్టంతో పాటు ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థలను రద్దు చేసి.. వాటిని ఒకే ‘గొడుగు సంస్థ’ కిందకు తీసుకురావడానికి వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లు- 2025ను తెచ్చేందుకు ఏర్పాటు చేసింది. అంతేగాకుండా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టింది. ఉన్నత విద్యను మార్చే క్రమంలో వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ అనే కమిషన్‌ తీసుకు వస్తున్నామని కేంద్రం చెబుతున్నది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల నిర్వహణ బాధ్యతను పర్యవేక్షిస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సంస్థను ఎత్తేసి, ఇక నుంచి రాజకీయ నాయకుల గుప్పిట్లో ఉండే కంట్రోల్‌ బాడీ లాంటి కమిషన్‌ను నియమిస్తుంది. పాతదాంట్లో లోపాలనూ, పనితీరునూ చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి కేంద్రీకృతం చేస్తామనడం ప్రమాదకరం.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర క్యాబినెట్‌ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌, హరిగౌతమ్‌ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి యూజీసీనీ రద్దు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్రప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత కేంద్రం నిటి ఆయోగ్‌ ద్వారా అనేక నూతన ప్రణాళికలను రూపొందించింది. విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని ఘనమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. యూజీసీ, ఏఐసీటీఈ స్థానంలో ఉన్నతవిద్యా కమిషన్‌(హీరా) చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు అప్పుడే మోడీ ప్రభుత్వం సిద్ధపడింది. అన్ని వైపులనుండి విమర్శలు వెల్లువెత్తటంతో వెనక్కుతగ్గింది. ఆ తర్వాత 2018లో యూజీసీ చట్టాన్ని, నిధుల సంఘాన్ని రద్దు చేసి వాటి స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌(హెచ్‌ఈసీఐ) బిల్లు తెచ్చి దేశ ఉన్నత విద్యారంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్ర సర్కారు వేసిన అడుగులకు బ్రేక్‌లు పడ్డాయి. ఆనాడు తీవ్ర వ్యతిరేకత కారణంగా అమలు కాని హెచ్‌ఈసీఐ ప్రతిపాదనను, ఇప్పుడు ఏబీఎస్‌ఏ అనే కొత్త పేరుతో మళ్లీ తీసుకురావడమే ఈ బిల్లు వెనుక అసలు ఉద్దేశం.

పార్లమెంటులో తమకున్న బలంతో ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా మతతత్వీకరించడంతో పాటు కార్పొరేట్‌, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా బిల్లును ఆమోదింపజేయ డానికి సిద్ధమైంది. ఇది అమలులోకి వస్తే ఉన్నతవిద్య పూర్తిగా ఖరీదైన వస్తువుగా మారనుంది. ”తక్కువ ప్రభుత్వం.. ఎక్కువ పాలన” అనే సూత్రాన్ని పాటిస్తున్నామని కేంద్రం చెబుతున్నప్పటికీ పన్నెండు మంది సభ్యులతో ఏర్పడబోయే వీబీఎస్‌ఏ కమిషన్‌లో తొమ్మిదిమందిని కేంద్రప్రభుత్వమే నియమిస్తుంది. కమిషన్‌ కింద నియంత్రణ (వినిమయన్‌), అక్రిడిటేషన్‌ (గుణవత్త), ప్రమాణాలు (మానక్‌) కౌన్సిళ్లు ఉన్నా అందులోనూ కేంద్రమే తమకు అనుకూలమైన సభ్యులను నియమించనుంది. కమిషన్‌లో సభ్యులు ఎవరు ఉంటారన్నది అందరికీ తెలిసిందే. ఉన్నత విద్యారంగానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు విద్యారంగ నిపుణుల, మేధావులు, విద్యార్థి సంఘాలు అనేక సూచనలు చేసినా వాటిని పెడచెవిన పెట్టడం దుర్మార్గమైన చర్య.
ఈ బిల్లు అమలైతే విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇవ్వడం, కోర్సులకు అనుమతులివ్వడం, ప్రమాణాలు నిర్ణయించడం, నిధుల కేటాయింపులు వంటి అధికారాలన్నీ ఒకే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోతాయి.

యూజీసీ అనేది కేవలం గ్రాంట్లు ఇచ్చే సంస్థ మాత్రమే కాదు. అది విశ్వవిద్యాలయాల స్వయంపాలనకు ఒక రక్షణ కవచంలా పనిచేసింది. ఏఐసీటీఈ సాంకేతిక విద్యకు, ఎన్‌సీటీఈ ఉపాధ్యాయ విద్యకు ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. ఆయా రంగాలకు తగిన నైపుణ్యం, అనుభవం, అవసరాల ఆధారంగా విధానాలు రూపొందించేవి. ఈ సంస్థల న్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురావడం వల్ల విద్యా నాణ్యత ఏముంటుంది? ఈ బిల్లుపై రాష్ట్రాల హక్కులు హరించబడ తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు కూడా కేంద్ర అధిష్టానం ఆదేశాలకు లోబడాల్సి వస్తుంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందించే స్వేచ్ఛ కోల్పోతాయి. దీన్ని ఏకపక్షంగా ముందుకు తేవడం కాకుండా రాష్ట్రాలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి ప్రతినిధులతో విస్తృత స్థాయి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని ముందుకు నెట్టాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ బిల్లు, విద్యను కేంద్రీకరించిన చర్యగా మాత్రమే కాకుండా, భారత ఫెడరల్‌ వ్యవస్థను బలహీనపరిచిన విషయంగా మిగులుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -