Sunday, February 15, 2026
E-PAPER
Homeజోష్సంకల్పమే అతని దృష్టి

సంకల్పమే అతని దృష్టి

- Advertisement -

చూపు కొంత పరిమితమైనా అతని కలలకు. పట్టుదలకు. ఆత్మవిశ్వాసం. ఆశయ సాధనకు. కళా నైపుణ్యానికి ఎలాంటి పరిమితులు లేవు. చిన్నప్పటి నుండి కొంత దృష్టి లోపంతో అవమానాలు ఎదుర్కొన్నా, విద్యార్థి దశలో వార్షిక పరీక్షలలో ఫెయిల్‌ అయినా కూడా దృఢ సంకల్పంతో పీహెచ్‌డీ సాధించి జీవితాన్ని విజయ గాథగా మార్చుకున్నాడు.

అతని పేరు డాక్టర్‌ ఈదునూరి వెంకటేశ్వర్లు. పేరు ముందు డాక్టర్‌ అనే పదం రావడానికి పలక బలపం పట్టిన క్షణం నుండి డాక్టరేట్‌ పట్టాను పొందే నాటికి అనేక సమస్యలను ప్రతిరోజు ప్రతిక్షణం ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాలోని నెక్కొండ మండల కేంద్రంలో షెడ్యూల్‌ కులంలో పేద నిరక్షరాశుల కూలి కుటుంబంలో పుట్టాడు వెంకటేశ్వర్లు. ఈదునూరి రంగయ్య, పుల్లమ్మ దంపతులకు మొదటి సంతానంగా 4 జనవరి 1976 వ తేదీన జన్మించాడు. తాను జన్మించిన రోజునే అమెరికాకు చెందిన డాక్టర్‌ దంపతులు విదేశీ పర్యటనలో భాగంగా నెక్కొండలో ఉన్న లూథరన్‌ చర్చికి వచ్చారు.

ఆ దంపతులకు సంతానం లేదు. వాళ్లు రంగయ్య ఇంటికి వచ్చి, తమకు సంతానం లేని కారణంగా వెంకటేశ్వర్లును తమకు దత్తత ఇవ్వమని, తాము మంచిగా చదివించి ప్రయోజకుడిని చేస్తామని అడిగారు. కానీ రంగయ్య దంపతులు దత్తతకు ఒప్పుకోలేదు. ఆ డాక్టర్‌ దంపతులు అమెరికాకు తిరిగి వెళ్లి, ఆశతో వరసగా మూడు సంవత్సరాలు వచ్చి దత్తత విషయం అడిగినా కూడా తల్లిదండ్రులు వెంకటేశ్వర్లును ఇవ్వలేదు. ఆ పసివాడే పెద్దవాడై డాక్టర్‌ పిలుపుకు సమానమైన డాక్టరేట్‌ పట్టా కాకతీయ యూనివర్సిటీ నుండి పొందాడు. పుట్టుకతోనే 75% దృష్టిలోపం, తెల్లటి శరీరం కారణంగా ఎండ, వాన, చలి అనారోగ్యాలకు తట్టుకోలేని పరిస్థితి. ఆర్థిక, సామాజిక సమస్యల మధ్య జీవనం పుట్టుక నుండి నేటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు.

విద్యాభ్యాసం
స్కూల్‌ క్లాస్‌ రూంలో తోటి విద్యార్థులు పక్కన కూర్చోబెట్టుకునేవారు కాదు. హేళన చేసి నవ్వుతూ ఈ తెల్లోడు వింతగా ఉన్నాడు ఏంది అని ఎగతాళి చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేసేవారు. టీచర్లు బోర్డుపై రాసే అక్షరాలు కనబడేవి కాదు. తోటి విద్యార్థుల నోడ్స్‌ అడిగి రాసుకునే వారు. టీచర్లు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని, అర్థం చేసుకొని చదువుకునేవాడు. తనకున్న లోకం కారణంగా తోటి విద్యార్థుల కన్నా ఎక్కువ సమయం చదివేవాడు. నెక్కొండలో ఒకటి నుండి 4 వరకు స్థానిక శ్రీరామకృష్ణ శిశుమందిర్‌లో చదివి ఆర్థిక సమస్య కారణంగా 5 నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాడు.

తోటి పిల్లలు సాధారణంగా చూసే ప్రపంచం అతనికి మసకబారినదే. ప్రతి రోజూ ఒక పరీక్షలా ఉండే అవమానాలు, విమర్శలు అతని ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. టెన్త్‌, ఇంటర్‌లో ఫెయిలైనా పట్టుదలతో చదివి డిగ్రీకి మహబూబాబాద్‌ ప్రభుత్వ కాలేజీలో చేరాడు. ఎకనామిక్స్‌ సబ్జెక్టును ఇష్టంగా మార్చుకొని ఎంఏ ఎకనామిక్స్‌ చేశాడు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్‌లో బీఈడీ పూర్తి చేశారు. తనకున్న దృష్టి లోపం కారణంగా చదువు పూర్తి చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. కానీ ఎప్పుడూ వలన అధిక సమయం కష్టపడి చదివి పాస్‌ కావడానికి కొంత ఎక్కువ సమయం తీసుకోవటం జరిగింది.

కృషి – పట్టుదల
పదవ తరగతిలో మ్యాథమెటిక్స్‌ మరియు ఇంటర్మీడియట్‌లో ఇంగ్లీష్‌ సబ్జెక్టులలో దృష్టిలోపం వలన ఫెయిల్‌ అయినా పట్టుదలతో డాక్టరేట్‌ పొందాడు.

స్ట్రగుల్‌ నుండి స్కాలర్‌గా…
ఆర్థిక, శరీరక సమస్యలతో సతమతమవుతూనే పరిశోధన చేయాలని దృఢ సంకల్పంతో 2014లో ఎకనామిక్స్‌ విభాగంలో ప్రొ|| తుమ్మల పాపిరెడ్డి పర్యవేక్షణలో ‘ఎమర్జింగ్‌ ట్రెండ్‌ ఇన్‌ కంజమ్షన్‌ ప్యాటర్న్‌ ఏ స్టడీ ఇన్‌ రూరల్‌ ఏరియా ఆఫ్‌ తెలంగాణ రీజియన్‌’ అనే అంశంపై పీహెచ్‌.డి పూర్తి చేశాడు. ఆర్థిక స్తోమత కారణంగా కోచింగ్‌లకు వెళ్లకుండా స్థానిక గ్రంథాలయాలలో లభించిన పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు మరికొన్ని పుస్తకాలను ఇంటి వద్దే చదివాడు. ఉద్యోగ పోటీలో చాలా సందర్భాలలో ఉద్యోగాలు చేతికి అందినట్లే అంది స్వల్ప మార్కులతో ఉద్యోగాలు కోల్పోయారు.

అడ్డంకులపై విజయం సాధించిన విద్యా యోధుడు
48 సంవత్సరాల వయసులో ఉద్యోగ అర్హత వయో పరిమితి కోల్పోయే సంవత్సరంలో చివరి క్షణంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్య సంస్థ ఆధ్వర్యంలో ఎకనామిక్స్‌ జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించారు. 2005 లో న్యూఢిల్లీలో జరిగిన ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సు హాజరయ్యారు. సెమినార్లకు హాజరయ్యి చాలా అంశాలపై పేపర్‌ ప్రజెంటేషన్స్‌, ఆర్థిక సామాజిక రాజకీయంగా సమాజంలో జరుగుతున్న సమస్యలపై సదస్సులలో ప్రజెంటేషన్‌ ఇచ్చేవాడు.

రచయితగా :
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా వివిధ దినపత్రికలకి 1000 కి పైగా లేఖలు రాశాడు. 2012లో దళిత సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రచనా రంగంలో మెలకువలు తెలుసుకొని చాలా అంశాలపై పరిశోధక వ్యాసాలు రాసి రచయితగా, పరిశోధకుడిగా పాఠకులలో పేరు సంపాదించుకున్నాడు. 2008లో గ్రామపంచాయతీ సిబ్బంది ఒక పరిశీలన అనే పరిశోధన వ్యాసం తెలుగు త్రైమాసిక మ్యాగజిన్లో ప్రచురణ అయింది. 2023లో తెలంగాణ రాష్ట్ర సామాజిక రచయితల వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్‌ లో సన్మానం పొందారు.

కుటుంబ జీవన పోరాటం :
కొన్ని పరిస్థితుల కారణంగా మొదటి వివాహం రద్దు చేసుకుని రెండవసారి గణేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి కుమారుడు హేమంత్‌ 7 వ తరగతి. కుమార్తె నివేదిత 3 వ తరగతి చదువుతున్నారు. నిరుద్యోగం సమస్యతో కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేటు పాఠశాలలో సోషల్‌ టీచర్‌గా పనిచేసి బ్రతుకు బండిని నడిపారు.

పురస్కారాలు, గౌరవాలు:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. విద్యార్థి ఉద్యమాలలో. సామాజిక ఉద్యమాలలో అనేక సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేశాడు. సామాజిక కార్యకర్తగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ, అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం అంబేద్కర్‌ యువజన సంఘం వరంగల్‌ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, సామాజిక రచయితల వేదిక సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ప్రేరణ : విజయ యాత్ర:
ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్న అతనే అభినందనలు ఆత్మీయ సన్మానాలు పొందుతూ ఈ రోజు గౌరవ ప్రదమైన స్థానంలో నిలిచాడు. అతని కథ మనకు నేర్పేది ఒక్కటే… ‘విజయానికి అడ్డంకులు కారణం కారాదు, మన దఢ సంకల్పం ముఖ్యం’. గురుకుల విద్యార్థులకు విద్యా బోధనతో పాటుగా, వివిధ అంశాల పై రచనలు చేస్తూ సామాజిక టీచర్‌గా తన విజ్ఞానాన్ని సమాజానికి పంచుతున్నారు.

బోనాసి రేణుక,
కాకతీయ యూనివర్సిటీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -