ఎల్పీజీ కొరతే కారణం : నహూమ్ అండ్ సన్స్
కోల్‌కతా: కోల్‌కతాలోని చారిత్రాత్మక నహూమ్ అండ్ సన్స్ బేకరీని మూసివేశారు. ఎల్పీజీ కొరత కారణంగా తొలిసారిగా తాత్కాలికంగా బంద్ చేసినట్టు ఈ బేకరీ యజమాని తెలిపారు. ఇది నగరంలోని ఏకైక యూదుల బేకరీ. అంతేకాక న్యూ మార్కెట్‌లో ఒక సుప్రసిద్ధ చిహ్నం. 120 ఏండ్ల కిందట స్థాపించబడిన ఈ దుకాణాన్ని 2013లో దాని యజమాని డేవిడ్ నహూమ్ మరణం, కోవిడ్-19 సందర్భంగా విధించిన లాక్‌డౌన్‌లో తప్పా ఎప్పుడూ మూసివేసిన సందర్భాలులేవు.
అలాంటిది మళ్లీ ఇప్పుడు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఫలితంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయంతో ఈ బేకరీ మూతపడింది. మార్చి 18 నుంచి మార్చి 22 వరకు ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ఈ బేకరీ నిర్వాహకులు ప్రకటించారు. పరిస్థితులు చక్కబడితే మార్చి 23న తిరిగి తెరుచుకుంటుందని భావిస్తున్నారు. నహూమ్ అండ్ సన్స్ బేకరీ.. ప్లమ్ కేకులు, లెమన్ టార్ట్‌లు, బ్రౌనీలు, ఆల్మండ్ మకరోన్‌లు , ఫిష్ ప్యాటీలు వంటి ప్రత్యేకమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇది స్థానికులు, సందర్శకులందరికీ ప్రియమైన సంస్థగా నిలిచింది.



