ఉపాధి హామీపై కేంద్రం తీరు సరికాదు : ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక, సామాజికవేత్తల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీ ఎన్‌ఆర్ ఈజీఏ)ను నిర్వీర్యం చేయడం దేశ చరిత్రలో పెద్ద తప్పిదంగా నిలుస్తుందని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక, సామాజికవేత్తలు కేంద్రాన్ని హెచ్చరిం చారు. ఈ మేరకు వారు ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖను రాశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను బలహీన పర్చటం ‘చారిత్రక తప్పిదం’ అవుతుందని పేర్కొ న్నారు. నోబెల్ బహుమతి విజేత జోసెఫ్ ఈ.స్టిగ్లిట్జ్, లేవీ ఎకనామిక్స్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షురాలు పవ్లినా ఆర్.చెర్నేవా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ, బెల్జియం లూవెన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇసాబెల్ ఫెర్రెరాస్, అమెరికాలోని న్యూ స్కూల్ ఫర్ సోషల్ రీసెర్చ్ ప్రొఫెసర్ డారిక్ హామిల్టన్, లేవీ ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రాండల్ రే, టెక్సాస్ యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్ ప్రొఫెసర్ జేమ్స్ గాల్బ్రెయిత్ వంటి ప్రముఖులు ఈ లేఖ రాసినవారిలో ఉన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను వారు ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన విధాన ప్రయోగంగా అభివర్ణించారు. ఈ చట్టం ఆర్థిక గౌరవాన్ని మౌలిక హక్కుగా తిరిగి స్థిరపర్చిందని వారు స్పష్టం చేశారు.
ఇది ప్రారంభ సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అపూర్వమైన వృద్ధిని నమోదు చేసిందనీ, గ్రామీణ వేతనాలు పెరిగాయనీ, ఆర్థిక ఉత్పాదకత, సమర్థత మెరుగుపడిందని అధ్యయనాలు స్పష్టంగా చూపిస్తున్నాయని లేఖలో వారు పేర్కొన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఉత్పాదకత లేని పథకం అన్న అపోహలను ఈ ఫలితాలు పూర్తిగా ఖండిస్తున్నాయని వివరించారు. అయితే దీర్ఘకాలంగా కొనసాగుతున్న నిధుల కొరత (క్రోనిక్ అండర్‌ఫండింగ్), వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఈ చట్టాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ప్రవేశపెట్టిన కొత్త బిల్లుతో ఈ పథకం అమలు బాధ్యతను రాష్ట్రాలపైకి మళ్లించటంతో పాటు తగిన కేంద్ర నిధులు ఇవ్వకపోవడం వల్ల చట్టం ఉనికే ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. అవసరమైన నిధులు కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని వివరించారు.
దీని ఫలితంగా ఆర్థికంగా బలహీనమైన రాష్ట్రాలు పనుల అనుమతులను తగ్గించుకోవాల్సి వస్తుందని, దీంతో పని కోసం ఉన్న డిమాండ్‌ను అణచివేస్తారని పేర్కొన్నారు. గత మూడేండ్లుగా పశ్చిమ బెంగాల్‌కు నిధులు నిలిపివేయడాన్ని వారు రాజకీయ దుర్వినియోగానికి ఉదాహరణగా చూపించారు. ఇలాంటి చర్యలు ఉపాధి హామీని అర్థంలేని మాటగా మార్చేస్తాయని వారు వివరించారు. ఈ చట్టం వేతనాలు ఇవ్వడమే కాకుండా.. బావులు, చెరువులు, రహదారులు వంటి గ్రామీణ ఆస్తులను సృష్టించి, స్థానిక ఆర్థిక వ్యవస్థలను ఉత్తేజపరుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేయడమంటే పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, పర్యావరణ సంరక్షణ కోసం నిరూపితమైన ఒక సాధనాన్ని వదిలేసినట్టే అవుతుందని హెచ్చరించారు. కాబట్టి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి, వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకొని, ఈ చట్టంలోని మౌలిక హామీను పునరుద్ధరించాలని సూచించారు.



