Monday, October 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆశాలు ఆరోగ్య రక్షణ కవచాలు

ఆశాలు ఆరోగ్య రక్షణ కవచాలు

- Advertisement -

– ప్రజావ్యతిరేక విధానాలపై వెనక్కి తగ్గం
– స్థిర కనీసవేతనం రూ.26 వేలు వచ్చేదాక పోరాటాలు
– 20 ఏండ్లు దాటినా ఆశాలకు కనీస వేతనాలు లేవు
– స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి : తెలంగాణ ఆశావర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి
– మహబూబ్‌నగర్‌లో యూనియన్‌ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

దేశమంతా కరోనా భయంతో ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితుల్లో.. ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల కోసం ఫ్రంట్‌ వారియర్స్‌గా పనిచేసిన ఆశా వర్కర్లు.. ఆరోగ్య రక్షణ కవచాలని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి. జయలక్ష్మి అన్నారు. రాత్రిపగలు తేడా లేకుండా ప్రతి రోజూ 12 గంటలకు పైగా పనిచేస్తున్న ఆశాలకు స్థిర కనీస వేతనం రూ. 26 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని క్రౌన్‌ ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా మున్సిపల్‌ టౌన్‌హాల్‌ నుంచి గడియారం చౌరస్తా, అంబేద్కర్‌ చౌరస్తా, బస్టాండ్‌ మీదుగా ఫంక్షన్‌హాల్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ జెండాలు చేబూని, భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దీప్లానాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు ప్రభుత్వ పనులను సైతం చేస్తున్న ఆశాలకు కనీస వేతన చట్టం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గర్భిణీని కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే ఒకోసారి రెండు, మూడు రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. అయినా వెరవక స్వంత కుటుంబాలను వదిలి ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. ఇంత చేస్తున్నా.. కాన్పులు, గర్భిణుల గుర్తింపు వంటి టార్గెట్లు పెట్టి వేతనాల్లో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటం దారుణమన్నారు. పారితోషకాలు, టార్గెట్ల వ్యవస్థను రద్దు చేసి ఆశాలను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏండ్లు దాటినా ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికుల హక్కులు హరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ఆశాలకు రూ.18 వేలు ఇస్తానని హామీ ఇచ్చి.. రెండేండ్లు కావస్తున్నా.. ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. వట్టి మాటలతో గాకుండా ఆశాల సమస్యలను పరిష్కరించి వెంటనే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి మాట్లాడుతూ.. కేంద్రంతో పోట్లాడి అనేక ఉద్యమాలు చేసి వేతనాలు పెంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల చేసిన పోరాటాల ఫలితంగా ఆశా వర్కర్లకు కేంద్రం రూ.1500 పెన్షన్‌ ఇచ్చిందని తెలిపారు. ఆశా వర్కర్లు చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడకుండా రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
ఆశాలు, అంగన్వాడీలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న స్కీం వర్కర్లు భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది స్కీం వర్కర్లు ఉన్నారని, వీరంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్నారని తెలిపారు. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, స్కీం వర్కర్ల పేరుతో కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్‌ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఆశాలను స్కీం వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అందజేయాలని డిమాండ్‌ చేశారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సెలవులు, ఉద్యోగ విరమణ తర్వాత అందించే ప్రయోజనాలను అందించాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్‌ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఆశాల జీవితాలను రోడ్డున పడేవిధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతి ఏటా ఆరోగ్య రంగానికి నిధులను తగ్గిస్తూ వస్తోందని విమర్శించారు. అందుకే పోరాట పటిమతో ఆశాలు తమ హక్కుల సాధన కోసం పునరంకితం కావాలని తెలిపారు. యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాసు మాధవి మాట్లాడుతూ.. స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలుగా తమను తీసుకొని వేతనం లేకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విమర్శించారు. వేతనాన్ని రూ.26వేలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్‌, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎ. రాములు, ఉమ్మడి జిల్లా సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -