Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ, భూదాన భూముల్లోకి పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలి

ప్రభుత్వ, భూదాన భూముల్లోకి పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలి

- Advertisement -

– గుడిసెలను తొలగించాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
– ధర్నాచౌక్‌లో సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

భూదాన, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న నిరుపేదలకు తక్షణమే పట్టాలివ్వడంతో పాటు ఆ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. పేదల గుడిసెలను తొలగించాలని చూసినా, వాటిని పెద్దలకు అప్పగించే ప్రయత్నం చేసినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు తక్షణమే ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ… గుడిసెలవాసుల పోరాటం వృథా కాదనీ, ఏ లక్ష్యం కోసం చలో అసెంబ్లీకి తరలి వచ్చారో వారి ఆశయాలన్ని ఎర్రజెండావెలుగులో అన్ని సాధించుకుంటామని నొక్కి చెప్పారు. పేదలకు ఎర్ర జెండాకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ వీడదీయలేరన్నారు. భూదోపిడీదారులు కొల్లగొట్టిన ప్రభుత్వ, భూదాన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే రెండు, మూడు బడ్జెట్లకు సరిపోను నిధులు సమకూరుతాయన్నారు. కమ్యూనిస్టుల భూ పోరాటం స్ఫూర్తితోనే వినోదాభావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆ భూములు పేదలకు దక్కాల్సిందేననని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ…ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని భూ పోరాటాలు సీపీఐకి కొత్తకాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 80 ఏండ్లు కావస్తున్నా పేదవాడికి ఉండడానికి ఇండ్లు లేకపోవడం పట్ల ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలన్నారు. బడాబాబులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడరనీ, పేదల గుడిసెలను మాత్రం ఇష్టానుసారంగా కూల్చుతున్నారని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇండ్లను కేటాయించకపోతే గ్రామసభల్లో ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ.. నిరుపేదలకు చట్ట ప్రకారం కనీసం సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదేనని స్పష్టం చేశారు. పేదలకు న్యాయం చేయకపోతే రాబోయే మూడు కార్పోరేషన్ల ఎన్నికల్లో సీపీఐ సత్తా ఏమిటో చూపుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..సామాజిక సర్వే చేపట్టి అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి ఉమా మహేశ్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌, హనమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, వరంగల్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ బాషామియా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్రచారి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు రామస్వామి, తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎన్‌.జ్యోతి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -