Thursday, March 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుడిసెంబరు 9న సీఎంతో గృహప్రవేశాలు

డిసెంబరు 9న సీఎంతో గృహప్రవేశాలు

- Advertisement -

దళారులకు చెక్‌ పెడుతూ అర్హులకు అండగా ప్రభుత్వం
311 మందికి కూల్చిన చోటే ఇండ్ల స్థలాల పట్టాలు, ఇండ్లు
సొంత జాగా ఉన్న 101 మందికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు
వెలుగుమట్ల భూ నిర్వాసితులకు అందజేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల
యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన..మోడల్‌ కాలనీగా తీర్చిదిద్దుతాం
భారీ బందోబస్తు పట్టాల పంపిణీ

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
డిసెంబర్‌ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా వెలుగుమట్ల భూదాన్‌ భూముల లబ్దిదారులు సామూహిక గృహప్రవేశం జరుపుకునేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మోడల్‌ కాలనీగా తీర్చిదిద్దుతామన్నారు. దళారులకు చెక్‌ పెడుతూ అర్హులకు అండగా నిలవటమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. వెలుగుమట్ల భూ నిర్వాసితులు 311 మందికి ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు.

పేదలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రభుత్వంపై కొంత మంది కావాలని బురద చల్లుతున్నారని చెప్పారు. పేదల నిస్సహాయతను ఆసరాగా తీసుకొని సమాంతర వ్యవస్థను నడిపేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. ఇకమీదట వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో పట్టాలు పొందిన పేదలు ఆత్మగౌరవంతో.. భయభ్రాంతులకు గురికాకుండా జీవించవచ్చని తెలిపారు. 412 మంది నిరుపేద కుటుంబాలకు ఒకేసారి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. గురువారమే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని లబ్దిదారులకు సూచించారు. అందుకు కావలసిన నీటి వసతిని కల్పిస్తామన్నారు.

పేదల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి
ప్రభుత్వం అందించిన పట్టాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం భూమి పూజ కార్యక్రమం గురువారం జరుపుకోవాలని మంత్రులు సూచించారు. డిసెంబర్‌ 9న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇతర మౌళిక వసతులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించుకోవాలన్నారు. పేదల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. పదేండ్ల పాటు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పేరిట మోసం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రశ్నించడం హాస్యాస్పదమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హతను ప్రధాన ప్రతిపక్షం కోల్పోయిందని తెలిపారు. పార్టీ తమను డబ్బులు వసూలు చేసిన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

భూదాన్‌ భూమిలో మౌలిక వసతులు కల్పన
వెలుగు మట్ల భూదాన్‌ భూముల్లో పేదలకు పంచగా మిగిలిన భూమిలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, ఫంక్షన్‌ హాల్‌, కమ్యూనిటీ హాల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి, కరెంటు, రోడ్లు, నీటి వసతి, తదితర మౌలిక సదుపాయాలు కల్పించి మోడల్‌ కాలనీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.మాట నిలుపుకున్నాం.. మార్చి 1న 15 రోజుల్లో అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తామని మాట ఇచ్చామని.. నాలుగు రోజులు ముందుగానే దాన్ని నిలుపుకున్నామని మంత్రులు తెలిపారు. ఎటువంటి భేషజాలకు పోకుండా పట్టాల పంపిణీ చేశామన్నారు. 2023 జులైలో నాటి ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలకు పాల్పడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

గత ఎనిమిదేండ్లుగా పేదలు ఇబ్బందులు పడిన మాట వాస్తవమని, ఆ సమస్యలకు నేడు పరిష్కారం లభిస్తుందని, అర్హులైన బాధితులు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే వారికి కూడా తమ ప్రభుత్వం తప్పని సరిగా ఇండ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. పేదలను మోసం చేసిన దళారులపై చర్యలు తీసుకోవాలని మంత్రులు పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. తెలంగాణ భూదాన్‌ యజ్ఞ బోర్డు పేరిట ఇచ్చిన పత్రాలు బోగస్‌ అని, సీసీఎల్‌ఏ ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. లాఠీచార్జి లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చివేసి దగాకోరులను తరిమివేశామని తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. ప్రత్యేక కేసు కింద పరిగణించి ఇంటి నిర్మాణానికి మంజూరు చేసే నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఎనిమిదేండ్ల తర్వాత నిర్భయంగా : లబ్దిదారులు
ఎనిమిదేండ్లుగా భూదాన్‌ భూముల్లో ఉంటున్నా రోడ్లు, కరెంట్‌, తాగునీరు వంటి మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డామని, నేడు అన్ని వసతులతో కూడిన లే అవుట్‌లో తమకు ఇంటి స్థలాలు కేటాయించటం హర్షనీయమని లబ్దిదారులు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, నిరుపేదలైన తమను అర్హులుగా ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇకమీదట తమ ఇండ్లలో తాము నిర్భయంగా జీవిస్తామన్నారు. కొందరు పార్టీ ఫండ్‌, విద్యుత్‌ పోల్స్‌, భూమి రెగ్యులరైజ్‌ కోసమని తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని, ప్రజలను మోసం చేస్తున్న వారికి శిక్ష పడే విధంగా చూడాలని మంత్రులను కోరారు.

ఎప్పటినుంచో ఉంటున్న వారిలో కొందరికీ పట్టాలు రాలేదని, కొద్దిరోజులుగా ఉంటున్న వారికి పట్టాలిచ్చారని ఒకరిద్దరు లబ్దిదారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌, కార్పొరేషన్‌ చైర్మెన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్ యాదవ్‌, నగర డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారా, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

భారీ బందోబస్తు
పట్టాల పంపిణీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లబ్దిదారులు, మీడియాని మినహా ఏ ఒక్కర్నీ కలెక్టరేట్‌ ప్రాంగణంలోని సమావేశం మందిరంలోకి అనుమతించలేదు. మంత్రులు వేదిక పైకి వచ్చిన వెంటనే సమావేశం మందిర తలుపులు మూసివేసి, గడియ పెట్టారు. కొందరికి ఇండ్ల పట్టాలు రాకపోవడంతో నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని పోలీసులు ముందు జాగ్రత్తగా వందలాది మందితో భద్రతా చర్యలు చేపట్టారు.

రాండమైజేషన్‌ ద్వారా ప్లాట్ల కేటాయింపు : కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి
వెలుగుమట్ల భూదాన్‌ భూములను లే అవుట్‌ చేసి 311 ఫ్లాట్లు చేశామని, లబ్దిదారులకు పారదర్శకంగా సాఫ్ట్‌వేర్‌తో మానవ ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్‌ ద్వారా ప్లాట్లు కేటాయించామని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. 1953 రికార్డుల ప్రకారం 147, 148, 149 సర్వే నెంబర్‌ లో 31.7 ఎకరాల భూమిని రాజా రామారావు భూదాన్‌ ఉద్యమంలో దానం చేశారని చెప్పారు. ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ మాట్లాడుతూ.. 2014లో కత్తి రామ చంద్రయ్య, ముత్తయ్య, కల్లూరి కృష్ణ, బాబూరావు, తదితర 21 మంది సభ్యులు కలిసి గ్రామీణ పేదల సంఘంగా ఏర్పడి భూదాన్‌ భూములను కబ్జా చేయించారని తెలిపారు.

పేదల దగ్గర నుంచి రూ.30 వేల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసి భూమి పట్టాలు ఇస్తామని ఆక్రమణలు చేయించారని అన్నారు. వీరిపై ఇప్పటివరకు 26 కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. వీరిలో కల్లూరు కృష్ణ ఇంటిలో చేపట్టిన తనిఖీల్లో రూ.మూడు కోట్ల వరకు పేదల నుంచి వసూలు చేసినట్టు ఆధారాలు లభించాయన్నారు. వీరి ఆస్తులు వివరాలు సేకరించి వాటి ద్వారా పేదల నుంచి వసూలు చేసిన డబ్బు రికవరీకి ప్రయత్నం చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -