మాగ్నటిక్ సర్వేపై అధికారుల మల్లగుల్లాలు
దారి మళ్లిస్తేనే పనులు పూర్తవుతాయనే వాదన తెరపైకి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలోనూ తర్జనభర్జన
ఎలాగైనా పనులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) పనుల పున:ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. భూమి లోపల జరిగిన మార్పుల కారణంగా సొరంగమార్గంలో ఇన్‌లెట్ 14వ కిలోమీటర్ వద్ద షియర్ జోన్(లూస్ సాయిల్) వల్ల ప్రమాదం జరిగి 2.5 కిలోమీటర్ల మేరకు పైకప్పు కుప్పకూలింది. 2025 ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి హెలీబోర్న్ సాంకేతికతో మాగటిక్ సర్వేను చేసింది. నెల రోజుల్లో పూర్తవుతుందని చెప్పిన ఈ సర్వేను మూడు నెలలు ఆలస్యంగా డిసెంబర్‌లో ఎన్‌జీఆర్‌ఐ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే సర్వేలో వారు ప్రస్తావించిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అనుమానాలపై అధికారులు ఇంకా ఓ కొలిక్కి రాలేక పోతున్నారు.
పై కప్పు కూలిన ప్రాంతంలో భూ ఉపరితలంలో భూమి పలకలు ఇంకా సంక్లీష్టంగా ఉన్నాయనీ, క్వార్జ్ట్, గ్రానైట్ రకాలకు చెందిన రెండు పలకలు భూమి ఉపరితలం నుంచి భూ గర్భంలోకి ఏటవాలుగా ఉందని సర్వేలో తేలింది. అలాగే ఆ ప్రాంతమంతా నీటి ప్రవాహాలు ఉండటంతో నీరు ఆగకుండా ఊరుతోందని సర్వేలో వెల్లడైంది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతం గుండా తిరిగి నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇన్‌లెట్ 14వ కిలోమీటర్ నుంచి వెనకకు నాలుగు కిలోమీటర్ల నుంచి సొరంగాన్ని దారి మళ్లిస్తే ప్రయోజనం ఉంటుందని వారంటున్నారు. అయితే ఆ ప్రక్రియ ఇప్పట్లో తేలదని సర్కార్ ఆందోళన చెందుతోంది. సొరంగం దారి మళ్లింపు అనేది అనేక అనుమతులు, ఇతర సవాళ్లతో కూడుకున్న నేపథ్యంలో పాత మార్గంలోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మొత్తం 43.931 కి.మీ. కాగా ఇన్‌లెట్ వైపు 13.936 కి.మీ. పూర్తయ్యింది. ఔట్‌లెట్ వైపు 20.435 కి.మీ. తవ్వారు. ఇంకా 9.533 కి.మీ. పూర్తిచేయాల్సి ఉంది.
ఏమిటీ సర్వే?
హెలికాప్టర్ మాగటిక్ సర్వే అనేది భూ భౌతిక పరిశోధనలో ఉపయోగించే అధునిక పద్దతి. హెలికాప్టర్‌పై మాగ్నోమీటర్ అనే సెన్సర్‌ను అమర్చి భూమి లోపల జరిగే మార్పులను కొలుస్తారు. ఖనిజాలు, చమురు, గ్యాస్, భూగర్భ నిర్మాణాలను మ్యాపింగ్ చేస్తారు. తెలగాణ, జార్ఘండ్, చత్తీస్‌గడ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ సర్వేలు జరిగాయి. గ్లోబల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ), ఆయిల్ అండ్ నేచర్ గ్యాస్ కంపెనీ(ఓఎన్‌జీసీ), (ఎంఈసీఎల్) వంటి సంస్థలు తరుచుగా ఖనిజాలను అన్వేషించేందుకు ఈ సర్వేలను నిర్వహిస్తాయి. సర్వే ద్వారా భూగర్బంలో 800 మీటర్ల నుంచి 1,000 మీటర్ల లోతు వరకు నిర్మాణ సంబంధమైన మార్పులను గుర్తిస్తారు. పియర్ జోన్స్, నీటి మార్గాలు, రాక్ అస్థిరతలను గుర్తిస్తారు.
అత్యాధునిక పద్దతిలో పనులు చేపట్టండి : అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
ఎస్‌ఎల్‌బీసీ పనులను అత్యాధునిక పద్దతుల్లో చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపాలని సూచించారు. మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రో మాగటిక్ సర్వే పూర్తయినట్టు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.
భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఉత్తమ్ వివరించారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి 25శాతం అదనపు జీతాలు ఉంటాయని తెలిపారు. ఈ సమీక్షలో లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీపై ఎలా ముందు కెళ్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



