Monday, February 2, 2026
E-PAPER
Homeదర్వాజఉద్యమకవి ఎలా వుంటాడు?

ఉద్యమకవి ఎలా వుంటాడు?

- Advertisement -

ప్రజా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని కవిత్వంతో ఇటు ఉద్యమాన్ని అటు సమాజాన్ని ప్రభావితం చేసిన కవిని ఉద్యమ కవి అంటారు. సందర్భాన్ని బట్టి ఉద్యమ కవికి యాక్టివిస్ట్‌ పొయెట్‌ అని, ప్రొటెస్ట్‌ పొయెట్‌ అని, మూవ్‌మెంట్‌ పొయెట్‌ అని, రెవల్యూషనరీ పొయెట్‌ అనే సంబోధనలు వాడుకలో ఉన్నాయి. సామాజిక స్పృహతో, అన్యాయాలను ఎదిరిస్తూ కవిత్వం ద్వారా పోరాడేవారిని యాక్టివిస్ట్‌ పొయెట్‌ అని, క్రూర వ్యవస్థకు నియంతృత్వ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ కవిత్వం రాసే కవిని ప్రొటెస్ట్‌ పొయెట్‌ అని, ఏదైనా ఒక నిర్దిష్ట సామాజిక లేదా రాజకీయ ఉద్యమంలో పాల్గొన్న కవిని మూవ్‌మెంట్‌ పొయెట్‌ అని, సమాజంలో సమూలమార్పు కోసం విప్లవాత్మక భావాలతో కవిత్వం రాసేవారిని రెవెల్యూషనరీ పొయెట్స్‌ అంటారు. ఈ నాలుగు కర్తృత్వాలకు తులతూగే పాటలను తెలుగు సాహిత్యానికి అందించిన నిఖార్సైన తెలంగాణ రాష్ట్రోద్యమకవి అందెశ్రీ.

పనిపాటలనుండి, పసులకాపరి అనుభవం నుండి, పల్లీయ సాంప్రదాయం నుండి పాటలు కట్టడం ఆరంభించి రాష్ట్రగీతం రచయితగా ఎదిగినతీరులో అందెశ్రీ ప్రతిభా పాండిత్యాల్లో తనకు తానే సాటి. నిరక్షరాస్యుడే అయినా సాహిత్యంలో అత్యున్నత డిగ్రీలున్నవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా పద్యాలను పాటలను అరుదైన శయ్యాసౌందర్యంతో చెప్పిన మూర్తీభవించిన శేముషి అందెశ్రీది. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం, సినిమాలకు సాహిత్యం అందించినందుకు వరించిన పలు నంది అవార్డులను చూసినప్పుడు వ్యక్తిత్వ వికాస ప్రసంగాలకు పాఠాలకు అందెశ్రీ జీవితం గొప్ప ఉదాహరణ.

సాహిత్య చరిత్రలో ఉద్యమ కవులు సామాజిక మార్పుకు విప్లవానికి చోదకశక్తిగా నిలిచిన సందర్భాలు ప్రపంచ పటం మీద అనేకం. ఇందుకు ‘మా నిజాం రాజు మాకు పట్టిన తరతరాల బూజు’ అంటూ నిజాం రాజుపై కలం దూసిన 1940-48 మధ్య జరిగిన హైదరాబాద్‌ రాష్ట్ర విముక్తి పొరాటమే ప్రబల సాక్ష్యం. జార్జ్‌ ఆర్వెల్‌ పండితుడు ‘Why I write’ గ్రంథంలో ప్రస్తావించిన కావ్యహేతువులు 1. ధిషణాహంకారం/ పాండిత్య గరిమ (Sheer Egoism), 2. సౌదర్య ప్రియత్వం (Aesthetic Enthusiasm), 3.చారిత్రక ప్రేరణ (Historical Impulse), 4.రాజకీయ ఆవశ్యకత (Political Purpose)లలో మొదటి రెండింటికి లోబడి కాకుండగా, మహోజ్వలమైన తెలంగాణ చరిత్ర నుండి ప్రేరణ పొందిన పౌరుడిగా , మూడుకోట్ల తెలంగాణ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆత్మగౌరవం, స్వయంపాలన సాధ్యకాగలదన్న రాజకీయావసరంగా పాటకు పట్టం కట్టిన క్రాంతదర్శి అందెశ్రీ.

ప్రముఖ కవి, నవలా రచయిత, వ్యాసకర్త, డెన్మార్క్‌ దేశపు ఆచార్యులు తబీష్‌ ఖైర్‌ అన్నట్టు “Great literature is not written by highly skilled wordsmiths who are aware, consciously or not, of this mutual relationship of language and reality” (LITERATURE AGAINST FUNDAMENTALISM, Oxford Press, Page:109) భాషకు వాస్తవికతక మధ్య ఉన్న లోతైన సంబంధమే గొప్ప సాహిత్యాన్ని సృష్టిస్తుంది. నిపుణులైన కవులు, రచయితలు స్పృహతో లేదా తెలియకుండానే అద్భుత పదసృష్టి చేసి మానవ అనుభవాన్ని దృశ్యమానం చేసి విశ్లేషిస్తారు. కొత్త కోణాలను, దృక్పథాలను సాహిత్యానికి చూపుతారు. ఈ కోవకు చెందిన ప్రజా కవి, వాగ్గేయకారుడే అందెశ్రీ.

ఇదే సందర్భంలో ఉద్యమకవులు రచయితలేం చేస్తారు? అనే ప్రశ్నను మనం వేసుకుంటే- ఇదిగో ఈ సమాధానాలు మనకు లభిస్తాయి. ఉద్యమ కవులు 1.చైతన్య రథసారధులు:- సామాన్యుల్లో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, వారి హక్కుల కోసం పోరాడతారు. 2.అన్యాయం పై గళమెత్తే ధీరులు:- అణచివేతకు భూస్వామ్య వ్యవస్థ దౌర్జన్యాలకు నిరంకుశ పాలకులమీద వీరోచితంగా యుద్ధం ప్రకటిస్తారు. 3. విప్లవ సందేశకులు:- పాండిత్యం కంటే ప్రజలకు అర్థమయ్యే వాడుక భాషలోనే కవితలు సృజిస్తూ పాటలు కడుతూ సరళమైన భాషలో విప్లవ సందేశాలను చేరవేస్తారు. 4.స్ఫూర్తి దాతలు:- జైళ్లు, శిక్షలు, ఆంక్షలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. 5.కలం యోధులు:- ఆకలి, పేదరికం, కుల వివక్ష, అసమానతలు, నిరుద్యోగం, వలసలు, దోపిడీ వంటి వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ సామాజిక సమస్యలపై దండెత్తి ప్రజలకు అండగా ఉద్యమకవులు మహత్తరమైన పాత్ర నిర్వహిస్తారు. 6.మార్పు ఏజెంట్లు:- సామాజిక మార్పుకు పునాదులు వేస్తూ విప్లవానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు.

ఈ పాత్రలన్నిటినీ అందెశ్రీ మహోన్నతంగా నిర్వహించాడు. కనుమరుగవుతున్న మనిషితనం జాడను గురించి, నానాటికీ మగ్యమవుతున్న మానవీయ విలువలను గురించి చింతిస్తూ ప్రపంచీకరణ మాయాజాలంపై ధ్వజమెత్తుతూ అందెశ్రీ రాసిన ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ తెలుగు ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాట (లోకప్రియ గీత/ ప్రచలిత గీత/ జనప్రియ గీత/Popular Song) గా ప్రజలనోళ్లలో రికార్డై వుంది. ఉద్యమ కవులను, కళాకారులను ‘సాంస్కృతిక సైనికులు (Cultural Soldiers)’గా మావో మహాశయుడు అభివర్ణించడం మనకు తెలిసిందే. ఏదేని ప్రజా ఉద్యమం విజయవంతం కావడానికి తుపాకీ పట్టిపోరాడే సైనికశక్తి ఎంత ముఖ్యమో,కలం పట్టి రచనలుచేసే కవులు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నాడు.

1942లో జరిగిన ప్రసిద్ధ ‘యెనన్‌ కాన్ఫరెన్స్‌’లో మాట్లాడుతూ ”In our struggle for the liberation of the Chinese people there are various fronts, among which there are the fronts of the pen and of the gun, the cultural and the military fronts. To defeat the enemy we must rely primarily on the army with guns. But this army alone is not enoughÑ we must also have a cultural army,

which is absolutely indispensable for uniting our own ranks and defeating the enemy( Mao Speech May 2, Talks at the Yenan Forum on Literature and Art- Selected works of Mao Tse- Tung, Marxists.Org) కవులు తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచే అజేయమైన సైన్యంగా పనిచేయాలని మావో సేటుంగ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన (2000-2014) మలిదశ ఉద్యమంలో రాజకీయ పక్షాలు ప్రజలు సైనికుల మాదిరి పోరాడితే, కవులు రచయితలు, కళాకారులు ముఖ్యంగా ‘తెరవే’ (తెలంగాణ రచయితల వేదిక) ఆధ్వర్యంలో దశాబ్దన్నర కాలం సాంస్కృతిక సైన్యంగా అలుపెరుగని పోరాటం చేశారు.

అందెశ్రీ ఉద్యమగీతాల్లో ఇంగ్లాండ్‌ సాహిత్య విమర్శకుడు,The Spectator ముఖ్య సంపాదకుడు J.D. Sctott తన Poetry of 1950వ‌ గ్రంథంలో పేర్కొన్న విధంగా ‘Movement Poetry’ లక్షణాలు ‘1.స్పష్టత మరియు భాషా సరళత (Clarity and simplicity of language), 2.భావోద్వేగ నిగ్రహం (Emotional restraint), 3. మేధోనిర్మాణం (Intellectual structure), 4.సామన్య ప్రజల జీవికను వస్తువుగా స్వీకరించడం (Focus on the Ordinary and Domestic Life), 5.ఆధునికతపై తిరుగుబాటు (Reaction on Modernity), 6.కాల్పనికతా వ్యతిరేకతా స్వరం (Anti Romantic Tone),

7. వ్యంగ్య వ్యాజోక్తి ప్రయోగం (Use of Irony and Understatement), 8.మధ్యతరగతి భావోద్వేగం (Middle Class Sensibility), 9.సాంప్రదాయ రూపం, ఛందోప్రక్రియ (Traditional form and Metrical Discipline)’ వస్తు శిల్పాలుగా అమరిపోవడం ఒక విశేషం. లోకకవిగా, మన కాలపు కాళిదాసుగా సాహిత్యలోకం చేత అమిత ప్రశంసలందు కున్న అందెశ్రీది విలక్షణ వ్యక్తిత్వం. ఉద్యమకవిగా ”అందెశ్రీ ఎప్పుడూ తనదైన ప్రపంచంలో ఉండేవారు. ఒక ఆలోచనల మధనం ఆయనలో నిత్యం జరుగుతూ ఉండేది. ఎవరినైనా పలకరింపుతో సరిపుచ్చేవాడు. కానీ ఒక్కసారి స్టేజ్‌ ఎక్కి మాట్లాడటం మొదలుపెడితే ఆయన పోటెత్తిన అల.. ఎప్పుడు ఆ అల తీరం చేరుతుందో మనం చెప్పలేం” అదీ ఉద్యమ కవి ఉజ్వలత.

  • డా.బెల్లి యాదయ్య
    9848392690
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -