Tuesday, November 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఈ నిర్లక్ష్యం..ఇంకెంతకాలం?

ఈ నిర్లక్ష్యం..ఇంకెంతకాలం?

- Advertisement -

దేశంలో రోజురోజుకీ విద్యావైద్య రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వీటికోసం ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా ఖర్చు పెడుతున్నది భారతీయులేనని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే తల్లిదండ్రులు తమ సంపాదనలో ఎక్కువభాగం విద్యా, వైద్యానికే ఖర్చు చేస్తున్నట్లు ప్రపంచబ్యాంక్‌, ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామికల్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసిడి)సర్వే లెక్కలు తేల్చింది. భారత రాజ్యాంగం భారతీయులంతా సమానమని చెపుతున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యపూరిత పాలన వలన అనేక రంగాల్లో సమాన అవకాశాలు దక్కడం లేదు. ప్రధానంగా దేశంలో, రాష్ట్రంలో నాణ్యమైన విద్య,మెరుగైన వైద్యం సంపన్నులకు అందినట్టు సామాన్యులకి దక్కడం లేదు. ఎనభయ్యవ జాతీయ శాంపిల్‌ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా చేసిన సమగ్ర నిర్మాణాత్మక సర్వేలో రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల్లో 64శాతం మంది ప్రయివేటు విద్యాసంస్థల్లో చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, తమ పిల్లల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రుల ఆకాంక్షలను, ఆందోళనలను యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.

అన్ని స్థాయిల్లో పూర్తి వ్యాపార ధోరణిలో, వివిధ పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులను నియంత్రించడలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అభివృద్ధి చెందిన ఏ దేశాల్లో ఈ పరిస్థితి లేదు. ఇది విద్యాహక్కుపై పాలకుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నది. అత్యంత ఆందోళన కలిగించే మరో అంశం అభ్యాస ఫలితాలు-2024 ఫరూక్‌ సర్వేలో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ జాతీయ సగటు కంటే కూడా చాలా తక్కువ ఉన్నట్లు తేలింది. మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో సగంమంది పిల్లలు కథలు చదవలేకపోతున్నారని, ప్రాధమిక గణితం కూడా చేయలేక పోతున్నారని, ఆరవ తరగతి విద్యార్థులు యూనిట్ల మార్పిడి చేయలేక పోతున్నారని, తొమ్మిదివ తరగతి విద్యార్థులలో 25 శాతం మంది లెక్కలు చేయలేకపోతున్నారని సర్వే తేల్చింది. ధనార్జనే లక్ష్యంగా కార్పోరేట్‌, ప్రయివేటు విద్యా సంస్థలు విద్యాప్రమాణాలు పాటించకుండా అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వలన ”చదువుకొనే ” ఈ బట్టీ చదువులు భవిష్యత్తు తరాలను అజ్ఞానంలోకి నెట్టేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ సర్వే ప్రకారం తెలంగాణలో ప్రతి సంవత్సరం ఐటీఐ నుంచి 26వేల మంది విద్యార్థులు పట్టాలతో బయటకు వస్తున్నారు.

వీరిలో కేవలం స్కిల్స్‌ ఉన్నవారికి మాత్రమే వందల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వారు లేబర్స్‌గా, ఇతర చోట్ల పనిచేస్తున్నారు.ప్రతి ఏడాది సుమారు లక్ష మంది ఇంజనీర్‌ పట్టా పొంది బయటకి వస్తే పదివేల మందికి కూడా నైపుణ్యం ఉండటం లేదు. ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది డిగ్రీ పట్టభద్రులు అవుతుంటే, నైపుణ్యం లేనివాళ్లు డెబ్బయి శాతం ఉంటున్నారు. చదివిన చదువులకు ఉద్యోగాలు రాక, అత్తెసరు జీతాలతో చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ తమ జీవితాలను నెట్టుకొస్తున్న నిరుద్యోగ యువతి, యువకులు ఎందరో ఉన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న జనాభా, తీవ్ర నిరుద్యోగ సమస్య, ప్రపంచ ఆకలి సూచి -2024 లెక్కల ప్రకారం ఇప్పటికే 105వ స్థానంలో ఉన్న మన దేశం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక ఆకలి కేకలు, అర్తనాదాలతో మరింతగా దిగజారే ప్రమాదం ఉంది.దీన్నిబట్టి చూస్తే ప్రతి బడ్జెట్‌లో విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించి ఖర్చుచేయాలి. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచాలి. ఇది పెట్టుబడిగా కాకుండా భవిష్యత్తు దేశ అభివృద్ధిగా గుర్తించాలి.

ప్రజలు తమ కష్టార్జితంలో విద్యతో పాటు ఎక్కువ భాగం ఖర్చు చేసేది వైద్యానికే.ఈ కల్తీ యుగంలో ప్రభుత్వల జవాబుదారితనం లేకపోవడంతో, కొంతమంది అధికారుల సరైన పర్యవేక్షణ లేక పీల్చే గాలి నుండి తాగే నీళ్ల వరకు ప్రతి ఒక్కటి కల్తీ అవ్వడం జగమెరిగిన సత్యం. ప్రయివేట్‌, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ రకరకాల టెస్ట్‌లు, ట్రీట్మెంట్‌ పేరుతో ప్రజల నుంచి వేలు, లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు కదా కనీసం పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కూడా సరైన సదుపాయాలు, సరిపడా మందులు, అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు.ఒక వైపు ప్రజల వైద్యం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, మరొక వైపు వైద్యాధికారుల పర్యవేక్షణ లేమి ఉండటంతో ప్రయివేటు ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతు న్నాయి. అర్హతలు లేని వైద్యులు, అనుమతులు లేకుం డానే హాస్పిటల్స్‌, స్కానింగ్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రజలు కొనే ప్రతి వస్తువుపై అధిక పన్నులు వసూలు చేస్తూ ప్రతియేటా లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న పాలక వర్గాలు ప్రజలకు ప్రాథమిక హక్కులైన నాణ్యమైన విద్య- మెరుగైన వైద్యం అందించాల్సిన కనీస బాధ్యత లేదా?దీన్ని ప్రశ్నించాల్సింది, గళమెత్తాల్సింది పౌర సమాజమే.

అనంతుల మధు
9505866698

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -