Sunday, January 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు''లిటరరీ ఫెస్టివల్‌''గా హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

”లిటరరీ ఫెస్టివల్‌”గా హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

- Advertisement -

పల్లెకు పుస్తకం పేరిట గ్రంథాలయాలకు పుస్తకాల వితరణ : హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ నిర్వాహకులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను పూర్తిస్థాయి ‘లిటరరీ ఫెస్టివల్‌’గా తీర్చిదిద్దుతామని సొసైటీ అద్యక్షులు యాకూబ్‌, కార్యదర్శి, వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 38వ బుక్‌ఫెయిర్‌ వివరాలను వారు వెల్లడించారు. ‘పుస్తక స్ఫూర్తి’ చర్చా గోష్ఠుల్లో 300 మంది ప్రముఖులు పాల్గొన్నారనీ, రికార్డు స్థాయిలో 54 పుస్తకాలు ఆవిష్కతమయ్యాయని వివరించారు. సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన ‘పల్లెకు పుస్తకం’ కార్యక్రమం ద్వారా సేకరించిన వేలాది పుస్తకాలను గ్రామాల్లోని గ్రంథాలయాలకు అందిస్తామన్నారు.

ఒకప్పుడు కేవలం వ్యాపార వేదికగా ప్రారంభమైన ఈ ప్రస్థానం, నేడు తెలంగాణ మేధోశక్తికి ప్రతీకగా మారిందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రారంభించి రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల్లో ఈ ఏడాది బుక్‌ఫెయిర్స్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. ”పుస్తక పఠనం కనుమరుగవుతుందన్న వాదనలను ఈసారి వచ్చిన భారీ జనసందోహం పటా పంచలు చేసింది. లక్షలాదిగా తరలివచ్చిన యువతే తెలంగాణలో వస్తున్న జ్ఞానవంతమైన మార్పుకు నిదర్శనం’ అని వారు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా ప్రాంగణానికి అందెశ్రీ పేరుతో పాటు, వివిధ వేదికలకు అలిశెట్టి రజిత, కొంపల్లి వెంకట్‌ గౌడ్‌ వంటి మహనీయుల పేర్లు పెట్టి నివాళి అర్పించామన్నారు.

రికార్డు స్థాయిలో అమ్మకాలు
ఈసారి బుక్‌ఫెయిర్‌లో రికార్డుస్థాయిలో రూ.8 కోట్లకు పైగా పుస్తకాలు అమ్ముడయ్యాయని తెలిపారు. దేశంలోనే మూడవ అత్యుత్తమ బుక్‌ఫెయిర్‌గా హైదరాబాద్‌ ఎదిగిందని ప్రకటించారు. 1,250 మంది విద్యార్థులతో నిర్వహించిన ‘బాలోత్సవం’ డిసెంబర్‌ 24న జరిగిన ‘పుస్తక వాక్‌’ కార్యక్రమాలు ప్రజల్లో విశేషమైన చైతన్యాన్ని నింపాయని వివరించారు. బుక్‌ఫెయిర్‌లో మొత్తం రూ.1,57,85,840 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇందులో నిర్వహణకు రూ.1,31,60,431 వ్యయం చేశామని వివరించారు. వివరాలన్నింటినీ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందు బాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి పి.నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు బి.శోభన్‌ బాబు, సంయుక్త కార్యదర్శి ఎం.సూరి బాబు, కార్యవర్గ సభ్యులు టి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -