9 వికెట్లతో ముంబయి ఘన విజయం
నవతెలంగాణ-హైదరాబాద్
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ మరో ఓటమి మూటగట్టుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎలైట్ గ్రూప్-డిలో ముంబయి చేతిలో 9 వికెట్ల తేడాతో హైదరాబాద్ చిత్తుగా ఓడింది. ఈ విజయంతో గ్రూప్‌లో ముంబయి అగ్రస్థానానికి చేరుకోగా.. హైదరాబాద్ ఐదో స్థానానికి పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు కుప్పకూలి ఫాలోఆన్ ఆడిన ఆతిథ్య జట్టు… ఫాలోఆన్‌లో 302 పరుగులు చేసింది. చామ మిలింద్ (85, 128 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితిన్ సాయి యాదవ్ (32, 57 బంతుల్లో 6 ఫోర్లు), మహ్మద్ సిరాజ్ (32, 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హైదరాబాద్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పించారు. ఓపెనర్లు అమన్ రావు (13), అభిరాత్ రెడ్డి (20) సహా రోహిత్ రాయుడు (7), రాహుల్ సింగ్ (33), రాహుల్ రాడేశ్ (2), నితేశ్ రెడ్డి (0) విఫలమవటంతో హైదరాబాద్ 111 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో కూరుకుంది.
ఈ సమయంలో టెయిలెండర్లు మిలింద్, నితిన్ యాదవ్, సిరాజ్‌లు రాణించారు. తొలి ఇన్నింగ్స్ లోటు అధిగమించటంతో పాటు ముంబయిని మరోసారి బ్యాటింగ్‌కు రప్పించారు. ముంబయి బౌలర్లలో ముషీర్ ఖాన్ (5/79) ఐదు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్థి (3/47), ఓంకార్ (2/48) రాణించారు. ఇక హైదరాబాద్ నిర్దేశించిన 10 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి 3.2 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అఖిల్ (4) అవుటైనా.. ఆకాశ్ ఆనంద్ (5 నాటౌట్), హిమాన్షు సింగ్ (1 నాటౌట్) లాంఛనం ముగించారు. సర్ఫరాజ్ ఖాన్ (227) ద్వి శతకంతో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 560 పరుగుల భారీ స్కోరు చేసింది. డబుల్ సెంచరీతో మెరిసిన సర్ఫరాజ్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్ తలపడనుంది.



