– హైకోర్టు
హైదరాబాద్ :వివాదాస్పద స్థలానికి సంబంధించి మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా కాంపౌండ్‌ను కూల్చివేయడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు పేర్కొంది. ఆక్రమణలైనా తొలగించే ముందు నోటీసులు ఇవ్వాల్సిందేనని చెప్పింది. ప్రయివేటు వ్యక్తుల కాంపౌం డ్‌ను కూల్చి వేసి ఏర్పాటు చేసిన కంచెను తమ ఉత్తర్వులు అందిన 48 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. అయితే అక్కడ ఏర్పాటు చేసిన బోర్డును యథాతథంగా ఉంచవచ్చని తెలిపింది. కోర్టులో ఉన్న కేసుకు చెందిన స్థలం వద్ద కాంపౌండ్ వాల్ కూల్చడాన్ని తప్పుపట్టింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ప్రాంతంలో ఉన్న స్థలానికి సంబంధించి కూల్చివేతలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, హైడ్రా పురపాలక శాఖ మార్గదర్శకాలకు లోబడి పనిచేయాలన్నారు. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
మరో కేసులో..
జూబ్లీహిల్స్‌లోని రాక్ గార్డెన్‌ను ఎనిమిది వారాల్లో పునరుద్ధరించాలని హైకోర్టు హైడ్రాకు ఆదేశించింది. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించి గార్డెన్‌ను రక్షించాల్సిన బాధ్యత హైడ్రాపై ఉందని పేర్కొంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించి రాక్ గార్డెన్‌లో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంది. కోర్టు ఉత్తర్వుల అమలు నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని ఆదేశించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణను ముగించింది.
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై పిటిషన్లు డిస్మిస్
మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్‌ల కేటాయింపుపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో చివరి దశలో కోర్టును ఆశ్రయించడం సముచితం కాదని అభిప్రాయపడింది. వార్డు రిజర్వేషన్ల జీవోలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పి పిటిషన్లను కొట్టేసింది.
ఇంగ్లిషులోనే వాదించాలి
ఖమ్మం జిల్లాకు సంబంధించిన పిల్‌లో తెలుగులో వాదనలు వినిపించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. కోర్టు విచారణ ప్రక్రియ ఇంగ్లీషులో సాగాల్సి ఉంటుందని, అందుకు న్యాయవాదిని నియమించుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. న్యాయవాదిని నియమించుకునేందుకు నాలుగు వారాల గడువు మంజూరు చేసింది. న్యాయవాదిని నియమించుకోలేనిపక్షంలో న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదిని నియమించుకోవచ్చునని సూచన చేసింది. ఒక కాంట్రాక్టర్‌కు 22 పనుల కాంట్రాక్ట్ ఇవ్వడంపై దాఖలైన పిల్‌లో పిటిషనర్ తెలుగులో వాదించబోగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
రవీంద్రనాథ్‌పై చర్యలేదంటూ ధిక్కరణ పిటిషన్
జూబ్లీహిల్స్ కోుఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు బీ. రవీంద్రనాథ్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సొసైటీ సభ్యులు జ్యోతిప్రసాద్, విజయభాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రవీంద్రనాథ్‌పై అనర్హత వేటు వేయాలంటూ 2024 అక్టోబర్ 26న సమర్పించిన వినతిపై కోుఆపరేటివ్ రిజిస్ట్రార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు వాదన.
హైడ్రా కూల్చివేత చట్ట ప్రకారం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



