Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫైర్‌ సేఫ్టీపై హైడ్రా తనిఖీలు ముమ్మరం

ఫైర్‌ సేఫ్టీపై హైడ్రా తనిఖీలు ముమ్మరం

- Advertisement -

జూబ్లీహిల్స్‌లో నీరూస్‌ షోరూమ్‌ సీజ్‌
నాంపల్లి స్టేషన్‌ రోడ్డులో ఫర్నీచర్‌ షోరూంకు తాళం

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో ఫైర్‌ సేఫ్టీపై షాపులతోపాటు వాణిజ్య సముదాయాల్లో హైడ్రా తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36లో ఉన్న నీరూస్‌ షోరూంను అధికారులు గురువారం తనిఖీ చేశారు. మూడు సెల్లార్లు, నాలుగు అంతస్తులతోపాటు పైన అనుమతి లేకుండా రూఫ్‌ షెడ్డు వేసి వస్త్రాలతో నింపేయడాన్ని హైడ్రా కమిషనర్‌ సీరియస్‌గా పరిగణించారు. రెండు అంతస్తుల్లో అమ్మకాలు, పైన మూడు అంతస్తుల్లో వస్త్రాల తయారీ, పెద్దమొత్తంలో నిల్వలు ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్‌ ఎన్వోసీ లేకుండా షాపులను నిర్వహిస్తున్నట్టు నిర్ధారించు కున్నారు. ఫైర్‌ నిబంధనలను పాటించకపోవడమే కాకుండా మంటలను ఆర్పడానికి అనువుగా లేకపో వడాన్ని గమనించారు. ఇలా ప్రతి విషయంలోనూ ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో సీజ్‌ చేయాలని హైడ్రా కమిషనర్‌ ఆదేశించారు. హైడ్రా, ఫైర్‌, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖలకు చెందిన అధికారులు ఈ తనిఖీల్లో ఉన్నారు. ఫైర్‌ అన్‌ సేఫ్‌ షాపుగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయడమే కాకుండా హైడ్రా ఫెన్సింగ్‌ వేసింది. విద్యుత్‌ అధికారులు సరఫరా బంద్‌ చేశారు.

నాంపల్లిలోని ఫర్నీచర్‌ షోరూంకు తాళం..
నాంపల్లి స్టేషన్‌ రోడ్డులో గత శనివారం బచ్చాస్‌ ఫర్నీచర్‌ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతిచెందిన ఘటన తర్వాత కూడా అదే రోడ్డులో ఉన్న దుకాణాదారులు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోవడాన్ని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తీవ్రంగా పరిగణించారు. నాంపల్లి స్టేషన్‌ రోడ్డులో రహీమ్‌, మన్నన్‌ ఎస్టేట్స్‌ స్టాండర్డ్‌ ఫర్నీచర్‌ దుకాణం భవనం ఆరు అంతస్తులుండగా, సెల్లార్‌తోపాటు మొత్తం అన్ని అంతస్తుల్లోనూ భారీగా ఫర్నీచర్‌ నిల్వలుంచడం, మెట్ల మార్గాన్ని కూడా మూసేసిన విధంగా స్టాక్‌ పెట్టడం పట్ల హైడ్రా కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్‌ ఎన్‌వోసీ లేకపోవడంతోపాటు ఆరు అంతస్తుల్లో ఎక్కడా ఫైర్‌ పరికరాలు కనిపించకపోవడాన్ని సీరియస్‌గా పరిగణించారు. మొత్తం 6 అంతస్తులు తనిఖీ చేసిన కమిషనర్‌ సీజ్‌ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఫైర్‌ విభాగంతోపాటు విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ భవనంలో వ్యాపార లావాదేవీలు జరగకుండా నిలిపేశారు.

7207923085 నంబరుకు ఫిర్యాదు చేయండి : హైడ్రా కమిషనర్‌
ఫైర్‌ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఎవరైనా గమనిస్తే వెంటనే హైడ్రా కంట్రోల్‌ రూమ్‌ 9000113667 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రజలకు సూచించారు. నేరుగా తన నంబరు 7207923085కు సమాచారం ఇవ్వాలన్నారు. షాపులను గోదాములుగా మార్చేసి వారి వ్యాపార వస్తువులను అందులోనే నిల్వ ఉంచడం, సెల్లార్లలో భారీ మొత్తంలో అగ్ని ప్రమాదానికి కారణమైన వస్తువులు పెట్టినట్లయితే సంబంధిత షాపు, వ్యాపార సముదాయాల వివరాలతోపాటు, ఏ ప్రాంతంలో ఉన్నదీ స్పష్టంగా పేర్కొంటూ వాట్సప్‌ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపాలని సూచించారు. అంతేకాకుండా Commissioner_HYDRAA పేరిట ఉన్న ఎక్స్‌(ట్విట్టర్‌)లోనూ ఫిర్యాదు చేయాలని హైడ్రా కమిషనర్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -