Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనివాస గృహాలను హైడ్రా కూల్చదు

నివాస గృహాలను హైడ్రా కూల్చదు

- Advertisement -

హైడ్రా కుమ్మక్కైందనే దానిపై ఎక్కడైనా విచారణ చేసుకోవచ్చు
వాసవి, వార్టెక్స్‌పై కూడా కేసులు పెట్టాం
ప్రతిదీ హైడ్రాకు ఆపాదిస్తున్నారు
గాజులరామారంలో ల్యాండ్‌ గ్రాబర్స్‌ కబ్జా
ఇప్పటి వరకు 923.14 ఎకరాలను కాపాడాం : హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌


నవతెలంగాణ-సిటీబ్యూరో
”నివాస గృహాలను హైడ్రా కూల్చదు.. ప్రతిదీ హైడ్రాకు ఆపాదిస్తున్నారు.. ఏదేమైనా నాలాలు, చెరువులను కబ్జా చేస్తే వదిలే ప్రసక్తే లేదు..” అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైడ్రా ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువులు సమాజ ఆస్తులని, వాటిని కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. తన సర్వీస్‌లో విమర్శలు కొత్తకాదన్నారు. తన నిబద్ధతకు 2007లో విజయవాడలో జరిగిన ఆయేషామీరా హత్యకేసు.. నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రణరు హత్యకేసులో నిందితులకు శిక్షపడేలా చేసిన దర్యాప్తులే నిదర్శనమన్నారు. ఇప్పుడు హైడ్రా చర్యలు కాస్త కఠినంగా అనిపించినా నగర భవిష్యత్‌ బాగుండాలంటే తప్పవన్నారు. ఇప్పటి వరకు 581 ఎంక్రోచ్‌మెంట్ల నుంచి 923.14 ఎకరాల స్థలం కాపాడామన్నారు.

గాజులరామారంలో ల్యాండ్‌ గ్రాబర్స్‌ అడ్డగోలుగా కబ్జా చేశారని కమిషనర్‌ తెలిపారు. 300 ఎకరాలకు పైగా కబ్జా చేశారని, 900 పైగా ఇండ్లు ఉన్నాయని వెల్లడించారు. ఆదివారం 260 ఇండ్లను కూల్చామని, ఇంకా 621 ఇండ్లు కూల్చలేదని తెలిపారు. ప్రభుత్వ స్థలం అని తెలియక కొంత మంది పేదలు ఇండ్లు కొనుక్కున్నారని చెప్పారు. గాజులరామారంలో గతంలో రెవెన్యూ వాళ్లు అనేక సార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు. హైడ్రా ఎవరి ఇంటికీ కరెంటు కట్‌ చేయలేదన్నారు. కేవలం ఖాళీగా ఉన్న ఇండ్లను మాత్రమే కూల్చామని, 621 ఇండ్లల్లో ప్రజలు ఉండటంతో కూల్చలేదని అన్నారు. కొందరు స్థానిక రౌడీ షీటర్లు కబ్జా చేసి, చిన్న చిన్న గదులు నిర్మించి అందులో పేదవారిని ఉంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారికి ఎదురు డబ్బులు ఇస్తూ ఆ ఇండ్లల్లో ఉంచుతున్నారని, కొందరు డబ్బులు పెట్టి కొన్న వాళ్లు కూడా ఉన్నారన్నారు. అలాంటి వారు ముందుకొచ్చి ఆ ఇండ్లను ఎవరి నుంచి కొన్నారో చెబితే, వారికి న్యాయం చేయడానికి హైడ్రా సిద్ధంగా ఉందన్నారు. కబ్జాలు తొలగించే సమయంలో.. కొందరు చిన్న పిల్లలతో వీడియోలు పెట్టి ట్రోల్‌ చేస్తున్నారని, మరి కబ్జాలను అలాగే వదిలేద్దామా అని ప్రశ్నించారు.

రాజీపడలేదు..
బిల్డర్స్‌తో హైడ్రా ఎక్కడా లాలూచి పడలేదని హైడ్రా కమిషనర్‌ తేల్చి చెప్పారు. 12 పెద్ద బిల్డర్స్‌పై కేసులు నమోదు చేశామన్నారు. వార్టెక్స్‌, వాసవి విషయంలో హైడ్రా కుమ్మకైందని చాలామంది ప్రచారం చేస్తున్నారని, ఎక్కడైనా హైడ్రా కుమ్మకైతుందా? విచారణ చేసుకోవచ్చన్నారు. వార్టెక్స్‌పై మొదట కేసు పెట్టింది హైడ్రానేనని, ముసాపేట్‌లో నాలా ఎంక్రోచ్‌ చేస్తే వాసవిపై కూడా కేసు పెట్టామని చెప్పారు. ఫాతిమా కాలేజ్‌ విషయంలో సల్కం చెరువు ప్రిలిమినరి నోటిఫికేషన్‌ చేస్తున్నామని, ఫైనల్‌ ప్రిలిమినరి నోటిఫికేషన్‌ పూర్తయ్యాక ఏం చేయాలో చేస్తామన్నారు. 2024, జులై 19న హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడమన్నారు. దీని విలువ రూ.45 నుంచి 50 వేల కోట్లు ఉంటుందన్నారు. దాదాపు 581 అక్రమణలు కూల్చేశామన్నారు.

క్లౌడ్‌ బరెస్ట్‌ జరుగుతోంది..
ఈ మధ్యకాలంలో క్లౌడ్‌ బరెస్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయని, మూడ్రోజుల కిందట కుత్బుల్లాపూర్‌లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని హైడ్రా కమిషనర్‌ తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురస్తున్నదన్నారు. అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌తో ఇలాంటి ఫ్లడ్‌ను కంట్రోల్‌ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. నాలాల పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే 100 ఏండ్లకు అనుగుణంగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాలాల్లో డీ సిల్టింగ్‌కు హైడ్రా పెద్దపేట వేస్తుందన్నారు. నాలాల్లో ఇటీవల ముగ్గురు కొట్టుకుపోయారని, అందులో ఒక్కరి మృతదేహం వలిగొండలో లభ్యం కాగా.. మిగతా వారి కోసం హైడ్రా తీవ్రంగా శ్రమించిందన్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇంకా దొరకలేదన్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 51టీమ్స్‌ పనిచేస్తున్నాయని, వాటిని మరింత పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -