Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపరకాల బస్టాండ్ వద్ద హైడ్రామా..

పరకాల బస్టాండ్ వద్ద హైడ్రామా..

- Advertisement -

పాదచారుల రక్షణ కంచె తొలగింపు
వృద్ధురాలి మృతి తర్వాత ఏర్పాటు చేసినా నిలవని వైనం
ఓటు బ్యాంకు రాజకీయాలపై మండిపడుతున్న స్థానికులు
ప్రశ్నించిన జర్నలిస్టులపై ఎమ్మెల్యే చిందులు
నవతెలంగాణ – పరకాల

పరకాల పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనాలు సామాన్యుల ప్రాణాల కంటే మిన్నగా మారాయి. గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం పోయిన తర్వాత మేల్కొన్న యంత్రాంగం, ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఏర్పాటు చేసిన రక్షణ కంచెను ఎమ్మెల్యే ఆదేశాలతో అర్ధాంతరంగా తొలగించడం ఇప్పుడు పట్టణంలో పెను చర్చకు దారితీసింది.

ఘటన నేపథ్యం..
గత నెల 31వ తేదీన బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న తోట రాధమ్మ అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ మున్సిపల్, పోలీస్, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో కీలక అడుగు వేశారు. చిరు వ్యాపారాలు రోడ్డును ఆక్రమించడం, పాదచారులకు నడిచే దారి లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించిన అధికారులు.. ఆక్రమణలను తొలగించి, తిరిగి ఆక్రమించకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. దీనివల్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరగడమే కాకుండా, ప్రయాణికులకు ఒక భరోసా లభించింది.

అయితే, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న కొందరి విన్నపంతో ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. కంచె వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయనే నెపంతో, దానిని తొలగించాలని అధికారులకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చారు. ప్రజాప్రతినిధి ఆదేశాలతో చేసేదేమీ లేక ఆర్టీసీ అధికారులు అప్పటికప్పుడు ఆ కంచెను తొలగించడం గమనార్హం.

పట్టణ ప్రజల ఆగ్రహం
కేవలం ముగ్గురు ఫుట్‌పాత్ వ్యాపారుల ప్రయోజనాల కోసం వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను గాలికి వదిలేస్తారా? అని పట్టణ ప్రజలు ఎమ్మెల్యే తీరును నిలదీస్తున్నారు. “అధికారులు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాల కోసం తుంగలో తొక్కడం దుర్మార్గం” అని స్థానికులు విమర్శిస్తున్నారు. మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమై, ఆక్రమణల వల్ల మరో ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.”ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎమ్మెల్యే సామాన్యుడి భద్రతను బలిపీఠం ఎక్కించడం పట్ల పరకాలలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.”

మీడియాపై ఎమ్మెల్యే చిందులు…
పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణల తొలగింపును పరిశీలించేందుకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి గురువారం బస్టాండుకు వచ్చారు. ఈ క్రమంలో స్థానిక జర్నలిస్టులు ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా.. ఆయన దురుసు మాటలతో చిందులు వేశారు. “జర్నలిస్టులు అయితే ఏంటి..? ఎవరికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నామని చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోవడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -