నేను బతికే ఉన్నాను అన్న స్టేట్‌మెంటు ఎప్పుడు, ఎందుకిస్తారు అని కాస్త ఊహలోకిగాని, నిజంగా కాని ఆలోచిస్తే సందర్భాలు చాలా దొరుకుతాయి. ఓటర్ల జాబితాలో చనిపోయినోళ్లు వచ్చి ఓటేసి మరీ పోతుంటారు. ఇదేందిర భై ఇట్లంటావు అనుకునేరు. ముందే చెప్పాను నేను బతికే ఉన్నాను అన్న మాట ఎప్పుడంటారో చెబుతానని. మరి ఆ మాట చెప్పకుండా చనిపోయినోళ్లస్తారని చెప్పడమెందుకని అనుమానమొస్తే, బతికున్నోడిని చనిపోయారనుకోవడమేమిటి అన్న ప్రశ్న నేను కూడా వేయవలసి వస్తుంది. పోయినోడి ఓటు ఎలాగైతే వేస్తారో ఉన్నోడిని పైకి పంపి వాడి నోట్లు కొట్టేసే జనాలున్నారు.
ఆసుపత్రిలో శవాలగది మార్చురీలో పోయాడనుకున్న మనిషి తాను బతికే ఉన్నానని చిన్నగా అరుస్తాడు. ఎవరు వింటారు చెప్పండి, చుట్టూ నిజంగానే పోయినోళ్ల శవాలు తప్ప ఎవరూ ఉండరు. ఏ డాక్టరో లేక ఇంకొకరో లోపలికొచ్చినప్పుడు వాళ్లకు తెలిసేలా అరవాలి. వాళ్లకు వినబడితే అదృష్టమే అనుకోవాలి.ఒక సినిమాలో చూశాం తండ్రి పేరు మీద వచ్చే బీమా డబ్బులకు ఆశపడి బతికున్నవాడినే దహనం చేసేవరకూ పోతారు కొడుకులు. చనిపోయాడనుకున్న భర్త చేతి వేళ్లు కొద్దిగా కదలడం చూస్తుంది అతని భార్య. అక్కడినుండి సీను మారిపోతుంది.
గాజాలో యుద్ధం అమానవీయంగా జరుగుతోంది, యుద్ధమెప్పుడూ ఎక్కడ జరిగినా అమానవీయంగానే ఉంటుంది. మానవత్వాన్ని చంపినాకనే యుద్ధం మొదలవుతుంది. అక్కడ పాలస్తీనా ప్రజలను రోజూ ఎంతమందిని చంపుతున్నారు అన్న విషయం చూసినా, చదివినా మనం ఆహారం తీసుకోలేము. అక్కడ తీసుకుపోయి పడేస్తున్న శవాల కుప్పల్లో ఇంకా కొనప్రాణంతో ఉన్నవాళ్లు ఉంటున్నారు. చేయో, కాలో కదిలించినవాళ్లను బతికించి మరీ చంపుతున్నారక్కడ.
నేను బతికున్నాను అని చెప్పే మనుషులున్నారు కాని మాలో మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పగలిగేవాళ్లు ఎంతమంది. మాటల్లో కాదు చేతల్లో ఈ మాటల్ని నిజం చేసేవాళ్లన్నమాట. జనాల్లో ముఖ్యంగా అధికారపీఠం ఎక్కినోళ్ళకు ఎన్నెన్నిసార్లు ఆ సీటెక్కామనే రికార్డులే ముఖ్యమైపోయింది కాని మాలో మంచితనం బతికే ఉంది అని చెప్పగలరా? ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు తప్ప అత్యవసరమైన సమయాల్లో, నోరు విప్పి మాట్లాడాల్సిన సందర్భాల్లో మౌనమె నీ భాష ఓ మూగ మనసా అని ఓ కవి అన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?
దేశంలో కొన్ని వ్యవస్థలున్నాయి అవి ఎప్పటికప్పుడు నేను బతికే ఉన్నాను అంటూ నిరూపించుకోవాలి. న్యాయవవస్థ, ఎన్నికల సంఘం మొదలైనవి తటస్తంగా ఉండి ప్రజలవైపు మొగ్గు చూపాలి, అప్పుడే ప్రజాస్వామ్యం ఉంది అని గుర్తొచ్చేది. అలాగే ఈ ప్రజాస్వామ్యమూ నేను బతికే ఉన్నాను అని తనకు తాను నిరూపించుకోవాలి. ఇదంతా ఎవరు చూస్తున్నారు, ఎవరు నోరు విప్పుతున్నారు, ఎవరు పట్టీ పట్ట నట్టుగా ఉన్నారని చూడాలి. మేధావులు, ఇంకా బాధ్యత తమది కూడా అనుకునే ప్రజలు కూడా మేము బతికే ఉన్నామని తమ గొంతు కలు వినిపిస్తూ ఉండాలి. అప్పుడే అవతలివారు సరిగా ఉండేది. రాయడానికి, మాట్లాడడానికి ఏమాత్రం భయపడినా ఇక నేను చచ్చిపోయాను అని వాళ్లు ప్రకటించినట్లే.
అతి పేదరికాన్ని చంపేసింది కేరళ. అంటే అతి పేదరికాన్ని శాస్త్రీయంగా చంపేసింది. తరువాత ఇతర పేదలమీద కూడా దృష్టి సారించి అసలు కఠిక పేదరికం కూడా లేకుండా చేసే ఆలోచన కేరళది. అక్కడ ప్రజలకు ఏ విపత్తు కలిగినా ముఖ్యమంత్రి మొదట కలిసేది, మాట్లాడేది, వెంట తిప్పుకొని పోయేది ప్రతిపక్షాలనే. వెంటనే యాచ కుల సంఖ్య తగ్గించాలని, వారిపై నిఘా పెట్టాలని, కావాలంటే చట్టం తెస్తామని చెప్పొచ్చు. మూలాల్లో ఉన్న రోగాన్ని పోగొట్టకుండా పైన కనిపించే దాన్ని బాగుచేయలేరు. ఇక ఇతర రాష్ట్రాలు మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దేమిటి. అన్నింటా రాజకీయ కోణమే, ప్రతిదీ రాజకీయ ఎత్తుగడే, ప్రతిదీ ఇతరులపై విమర్శే.
వీళ్లు దేన్ని బతికిస్తున్నారు, దేని మీద బతకాలనుకుంటున్నారు, దేన్ని చంపుతున్నారు, దేన్ని వెంటనే చంపాలనుకుంటున్నాను ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఎవరికంటూ వారికి గానా భజానా చేసే పేపర్లు, మీడియా ఇవన్నీ ఉన్నాయి. బాగా బతికిపోతున్నాయి కూడా. ఇక ప్రజల సమస్యలు పక్కదారిపట్టి సంపూర్ణాయుస్షుతో వర్ధిల్లిపోతున్నాయి. వాటిని ఎప్పుడు చంపుతారు? అవెప్పుడూ మేము బతికే ఉన్నాము అం టాయా ఇంకెన్నిరోజులు చెప్పుకోవాలి మేమున్నామని? 2047 వరకు ఇలాగే ఉంటుందా లేక దాన్ని 2147 దాకా వాయిదా వేస్తారా?
జంధ్యాల రఘుబాబు
9849753298


