Tuesday, January 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే

- Advertisement -

అధికార మార్పిడి సజావుగా జరిగే వరకూ అమెరికాయే నడుపుతుంది : ట్రంప్‌
సామాజిక మాధ్యమంలో పోస్ట్‌


వాషింగ్టన్‌ : వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ తనని తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో తన ఫొటోను షేర్‌ చేశారు. అది ఆయన వికీపీడి యాకు సంబంధించిన ఎడిట్‌ చేసిన పేజీలో ఉన్న ఫొటో. అందులో ‘వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు’ అని ఉంది. 2026 జనవరిలో వెనిజులా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినట్లుగా పేర్కొంది. అమెరికా దళాలు కొద్ది రోజుల క్రితం వెనిజులాపై దాడి చేసి దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను బలవంతంగా అపహరించుకొని వెళ్లిన సంగతి తెలిసిందే. అధికార మార్పిడి సజావుగా జరిగే వరకూ వెనిజులా ప్రభుత్వాన్ని అమెరికాయే నడుపుతుందని ట్రంప్‌ అప్పుడు చెప్పారు. అయితే వెనిజులా సుప్రీంకోర్టు దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగుజ్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది. ఇందుకు ట్రంప్‌ కూడా అంగీకారం తెలిపారని సమాచారం. అయితే ట్రంప్‌ ఆ తర్వాత స్వరం మార్చారు. తన డిమాండ్లకు అంగీకరించి, సహకరించని పక్షంలో రోడ్రిగుజ్‌పై కూడా సైనిక చర్యకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

మదురో కంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బెదిరించారు. నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేస్తామంటూ వెనిజులా ప్రకటన చేయడానికి అమెరికా చర్యే కారణమని చెప్పారు. ఈ విషయాన్ని మరచి పోవద్దని విడుదలైన ఖైదీలకు హితవు పలికారు. కాగా వెనిజులాలో చమురు ఉత్పత్తి వేగవంతంగా జరగడానికి వీలుగా వంద బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సిందిగా ట్రంప్‌ గత వారం అమెరికా చమురు కంపెనీలను కోరారు. వెనిజులాలో ఏయే చమురు కంపెనీలు కార్యకలాపాలు సాగించాలో తానే నిర్ణయిస్తానని తెలిపారు. అమెరికాకు యాభై మిలి యన్‌ డాలర్ల ముడి చమురును సరఫరా చేసేందుకు వెనిజులా తాత్కాలిక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు కూడా. వెనిజులాలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ట్రంప్‌ ఇటీవలే కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. వెనిజులా చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్‌ వాటిని పరిరక్షించే పేరుతో ఈ చర్య తీసుకున్నారు. వెనిజులా చమురు అమ్మకాల ద్వారా అమెరికా సంపాదించిన సొమ్మును కాపాడుకోవడమే ఈ ఆదేశం ముఖ్యోద్దేశం.

వెనిజులాలో ఎక్సాన్‌ మొబిల్‌ను పెట్టుబడి పెట్టనివ్వను : ట్రంప్‌
ప్రపంచంలో అతి పెద్ద చమురు, సహజ వాయువు, రసాయన కంపెనీలలో ఒకటైన ఎక్సాన్‌ మొబిల్‌ను వెనిజులాలో పెట్టుబడులు పెట్టనివ్వనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఈ కంపెనీ ఇంధనాలు, లూబ్రికెంట్లు, రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఎక్సాన్‌, మొబిల్‌, ఎస్సో వంటి బ్రాండ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత వారం శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో ఎక్సాన్‌ మొబిల్‌ సీఈఓ డిరెన్‌ ఉడ్స్‌ మాట్లాడుతూ వెనిజులాలో పెట్టుబడులు పెట్టలేమని స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహించిన ట్రంప్‌ ఆ కంపెనీని వెనిజులాలో అడుగు పెట్టనివ్వబోనని చెప్పారు. వెనిజులా చమురు పరిశ్రమ పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆ దేశం యొక్క చట్టాలను మార్చాల్సిన అవసరం ఉన్నదని ఆ సమావేశంలో ట్రంప్‌కు డిరెన్‌ ఉడ్స్‌ తెలియజేశారు.

‘మా ఆస్తులను ఇప్పటికే రెండు సార్లు స్వాధీనం చేసుకున్నారు. మూడోసారి ఆ దేశంలో ప్రవేశించాలంటే చట్టాలలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. ఈ సమావేశానికి మరో 17 చమురు కంపెనీల అధిపతులు కూడా హాజరయ్యారు. వెనిజులా చమురు పరిశ్రమకు ఊతమిచ్చేందుకు వంద బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ఈ సమావేశంలో కంపెనీల అధిపతులను ట్రంప్‌ కోరారు. ఆ సమావేశంలో ఎక్సాన్‌ స్పందన తనకు నచ్చలేదని ట్రంప్‌ అన్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ఆదివారం వాషింగ్టన్‌ వెళుతూ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఎక్సాన్‌ను దూరం పెట్టడానికే ఇష్టపడతాను. వారి స్పందన నాకు నచ్చలేదు. వారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -