Saturday, February 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ విధానాలు నచ్చలే

ట్రంప్‌ విధానాలు నచ్చలే

- Advertisement -

భారతీయ అమెరికన్లలో పెరిగిన అసంతృప్తి
55 శాతం మంది నుంచి వ్యతిరేకత
కార్నెగీ ఎండోమెంట్‌ సర్వేలో వెల్లడి

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో పాటు పలు దేశాలపై ఇష్టారీతిన సుంకాలు విధించడం, పలు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే ట్రంప్‌ విధానాలపై ఇప్పుడు అమెరికాలో ఉండే భారతీయుల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల నిర్వహణపై ఇండో అమెరికన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 55 శాతం మంది భారత్‌ పట్ల ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. 20 శాతం మంది మాత్రమే ఆయన దృక్పథాన్ని సమర్థించారు. కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ విడుదల చేసిన 2026 ఇండియన్‌ అమెరికన్‌ ఆటిట్యూడ్‌ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.

కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌, యూగవ్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే 1000 మంది భారతీయ అమెరికన్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 2020లో ట్రంప్‌ తొలి పర్యాయం సమయంలో 35 శాతం మంది ట్రంప్‌నకు మద్దతు పలకగా.. ఇప్పుడు ఆ సంఖ్య దారుణంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. 2024 చివర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ఇండియా వ్యవహారాలపై 48 శాతం మంది మద్దతు లభించటం గమనార్హం. సర్వే ప్రకారం.. వాణిజ్య విభేదాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలలో ఆటంకాలు, వ్యూహాత్మక సహకారంలో సమస్యలు, క్వాడ్‌ కూటమి, ఇండో-పరిఫిక్‌ లక్ష్యాలపై ట్రంప్‌ విధానాలు ప్రభావం చూపుతున్నాయని ఇండో అమెరికన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డెమోక్రటిక్‌ వైఖరికి మద్దతిచ్చే భారతీయ అమెరికన్ల (46 శాతం)లో 70 శాతం మంది ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్‌ మద్దతుదారుల్లో 50 శాతం మంది ఆయన విధానాలను అనుకూలంగా చూస్తున్నారు.

డెమోక్రాట్ల వైపు ఇండో-అమెరికన్ల మొగ్గు
ఇక యువతలో (18-29 ఏండ్లు) డెమోక్రాట్ల వైపు మళ్లీ మొగ్గు పెరిగినట్టు సర్వే పేర్కొంది. ఇటీవల అమెరికాకు వలస వచ్చినవారు, గత రెండు దశాబ్దాలకు ఇక్కడకు వచ్చినవారిలో డెమోక్రాట్లకు మద్దతు కొద్దిగా పెరిగింది. ఇక హిందువులు ప్రధానంగా డెమోక్రాట్లకు మద్దతు ఇస్తుండగా.. భారతీయ క్రైస్తవుల్లో రిపబ్లికన్‌కు మద్దతు పెరుగుతోంది. ఇక వివక్ష అంశంలో సగం మంది తాము ఆ బాధను అనుభవించామని చెప్పారు.

2025 ప్రారంభం నుంచి వ్యక్తిగత వివక్ష అనుభవించామని వారు వివరించారు. చర్మం రంగు ఆధారంగా 36 శాతం మంది, దేశం ఆధారంగా 21 శాతం మంది, మతం ఆధారంగా 17 శాతం మంది తాము వివక్ష ఎదుర్కొన్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యలు పెరిగినట్టు 48 శాతం మంది తెలిపారు. మొత్తానికి అమెరికాలో రాజకీయ అస్థిరత, ఇండియా-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతల నడుమ భారతీయ అమెరికన్‌ సమాజం ఆర్థిక స్థిరత్వాన్నే ప్రాధాన్యంగా భావిస్తున్నట్టు ఈ సర్వే స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -