Sunday, January 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసంగారెడ్డిలో ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను

సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను

- Advertisement -

నా భార్య పోటీ చేసినా.. ప్రచారానికి రాను
నా ఓటమికి కారణం పేదలు కాదు.. మేధావులు, పెద్దలే : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి


నవతెలంగాణ-సంగారెడ్డి
‘కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ స్వయంగా ప్రచారంలో పాల్గొని నా భుజంపై చేయి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తే.. నన్ను ఓడించారు. ఇక సంగారెడ్డిలో నా జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయను’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి మున్సిపాల్టీలో 2012-2013లో ఇండ్ల పట్టాలు పొందిన వారితోపాటు ఇంటి స్థలం లేనివారితో స్థానిక గంజ్‌ మైదాన్‌లో శనివారం టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలతో కలిసి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని తాను బాధపడినట్టు చెప్పారు. తనకోసం రాహుల్‌ గాంధీ సంగారెడ్డికి వచ్చి గెలిపించాలని ప్రచారం చేస్తే ఓడించారన్నారు. అందుకే సంగారెడ్డిలో ఇక జీవితంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయను అని స్పష్టం చేశారు. తన ఓటమికి కారణం పేద ప్రజలు కాదని, ఇక్కడి మేధావులు, పెద్దలే అని అన్నారు.

సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా తాను ప్రచారానికి రాను అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాను ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను అని చెప్పారు. కిరాయి ఇండ్లలో ఉండేవాళ్ల కష్టాలు తనకే ఎక్కువగా తెలుసని, 22 ఏండ్లు కిరాయి ఇంట్లోనే ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. అందుకే మీకు సొంత ఇంటి జాగ ఉండాలని ప్రయత్నం చేస్తున్నా అని చెప్పారు. 2013లోనే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో మాట్లాడి సంగారెడ్డిలోని 5500 మంది పేద ప్రజలకు 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించినట్టు చెప్పారు. ఆ రోజు అలియాబాద్‌, తోగర్‌పల్లిలో తాను ఇప్పించిన స్థలాలను బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో తిరిగి వేరే పనుల కోసం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మళ్లీ 80 గజాల స్థలం ఇవ్వడానికి సంగారెడ్డి, కంది మండలాల్లో 200 ఎకరాల స్థల సేకరణ చేయడానికి కలెక్టర్‌తో మాట్లాడినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -