– రాష్ట్ర వ్యాప్తంగా 40వ వర్ధంతి
నవతెలంగాణ- విలేకరులు
ఆదర్శనేత.. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు.. దక్షిణభారత దేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఘన నివాళులు అర్పించారు. పలుచోట్ల రక్తదాన కేంద్రాలు నిర్వహించారు. సుందరయ్య విగ్రహాలను ఆవిష్కరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఈదులగూడెం వద్ద ఉన్న సుందరయ్య విగ్రహానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహం వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు పారేపల్లి సత్యనారాయణరావు ఆవిష్కరించారు. అనంతరం ఈదులగూడెం నుంచి సీపీఐ(ఎం) కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. ఆదర్శనీయుడు సుందరయ్య అని, ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పేద ప్రజల కోసం పోరాటాలు సాగించారని చెప్పారు. జ్యోతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మువ్వ రామారావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి సుందరయ్య ప్రాణం పోశారన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో సుందరయ్య చిత్రపటానికి రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్దిపేటలోని కార్మిక కర్షక భవనం జిల్లా కార్యాలయంలో సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన సుందరయ్య వర్ధంతి సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు పాల్గొని నివాళులర్పించారు. పీడిత ప్రజల విముక్తి కోసం సుందరయ్య చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్ ఐఎస్ సదన్‌లోని ఆలం ఖుంద్ మీరీ భవన్‌లో సీపీఐ(ఎం) సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ పూలు మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు ప్రధాన పాత్రధారుడు సుందరయ్య అని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా భూపోరాట కేంద్రం కాలనీలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఎర్ర సూర్యుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నాగయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీలో ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి ఇందిరా నగర్‌లో సీపీఐ(ఎం) ఆఫీస్ వరకు ఎర్రదండు కవాతు నిర్వహించారు. పార్టీ హవేలీ కమిటీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు అధ్యక్షతన బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు.
