సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
నవతెలంగాణ-కెరమెరి
గంజాయి సాగును నిర్మూలించే లక్ష్యంతో కుమురం భీం అసిఫాబాద్ పోలీసులు వినూత్నంగా ఆలోచన చేశారు. డ్రోన్ల ద్వారా గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ చర్యలు ప్రారంభించింది. ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో కెరమెరి మండలం అంతపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణగూడలో డ్రోన్ సహాయంతో పంట భూముల్లో తనిఖీలు నిర్వహించారు. రాథోడ్ బాలాజీ వ్యవసాయ పొలంలో 51 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జూన్ నుంచి ఆసిఫాబాద్ సబ్ డివిజన్‌లో 51 కేసులు కాగా.. 560 మొక్కలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి డ్రోన్‌లతో తనిఖీలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ మధుకర్ పాల్గొన్నారు.