12 రాష్ట్రాల్లో సర్ అమలు సరికాదు
సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు వెల్లడించలేదు
వామపక్ష, లౌకిక శక్తులను ఐక్యం చేస్తాం
రాజకీయ ఉద్దేశంతో ఈసీ నిర్ణయాలు
ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం) నేత ప్రకాశ్‌కరత్ డిమాండ్..హైదరాబాద్‌లో ముగిసిన రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాటం చేయాలని సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) రాజకీయ ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను అమలు చేయాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందనీ, ఇంకా తుది తీర్పు వెల్లడించలేదని గుర్తు చేశారు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలనీ, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైన సీపీఐ(ఎం) అఖిల భారత స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను ఆరు రోజులపాటు నిర్వహించారు. మంగళవారం ముగింపు కార్యక్రమానికి ప్రకాశ్‌కరత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఏప్రిల్‌లో మధురైలో నిర్వహించిన సీపీఐ(ఎం) 24వ మహాసభలో నిర్దేశించుకున్నామని చెప్పారు. పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడంతోపాటు రాజకీయంగా, సైద్ధాంతికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ రాజకీయ శిక్షణా తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పార్టీ సభ్యత్వం, నిర్మాణం బలోపేతం కావాలని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తున్నదని చెప్పారు. 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ నిర్వహించాలని ఈసీ ప్రకటించిందని అన్నారు. రెండు నెలల క్రితం ఎస్‌ఐఆర్‌ను బీహార్‌లో నిర్వహించిందని గుర్తు చేశారు. లౌకిక, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయని చెప్పారు. బతికున్న ప్రజల ఓట్లను ఈసీ తొలగించిందని విమర్శించారు. ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు.
ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ అమలు చేయాలని ఈసీ ప్రకటించిందని అన్నారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించ లేదన్నారు. మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందనీ, ఇంకా తుది తీర్పు వెల్లడించలేదని గుర్తు చేశారు. ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. ఈ సమయంలో ఎస్‌ఐఆర్‌ను నిర్వహిస్తే ప్రజలు గందరగోళానికి గురవుతారని అన్నారు. ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ఆధార్‌కార్డును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పారు. రాజకీయ ఉద్దేశంతో ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలనీ, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగిం చుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈసీ తీరుపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. గతంలో ఈసీ నిర్ణయాలను ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేకించేదని గుర్తు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. ఈసీ స్వతంత్రతను కోల్పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ హిందూత్వ ఎజెండాను అమలు చేస్తున్నాయని విమర్శించారు. మైనార్టీలపై దాడులు చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలే లక్ష్యంగా పాలన సాగుతున్నదని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రాజకీయ శిక్షణా తరగతులు పార్టీ బలోపేతానికి, నాయకుల ఎదుగుదలకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫీజు బకాయిలు విడుదల చేయాలి : జాన్‌వెస్లీ
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ధ్రువపత్రాలు కాలేజీ యాజమాన్యాల వద్ద ఉన్నాయని అన్నారు. ఉన్నత చదువులకు వెళ్లడానికి ఉద్యోగాలు చేయడానికి ఇబ్బందిగా మారిందన్నారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న జరగనున్న విద్యార్థి సంఘాల రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందని అన్నారు. ఖాళీ పోస్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలంటూ నిరుద్యోగ జేఏసీ చేపట్టే ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. సీపీఐ(ఎం) మాజీ ఎంపీ పికే బిజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
లౌకిక శక్తులను ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యం : రాఘవులు
పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిద్ధాంత, రాజకీయ అవగాహనను పెంచడం కోసమే ఈ శిక్షణా తరగతులను నిర్వహించామని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. రాబోయే కాలంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు తమ పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తామని అన్నారు. లౌకిక శక్తులన్నింటినీ ఒక వేదికపైకి తేవడమే తమ లక్ష్యమన్నారు.



