– ఫీజు బకాయిలపై బహిరంగచర్చకు సీఎం సిద్ధమా?
– బడా కాంట్రాక్టర్లకు బిల్లుల విడుదలపై శ్వేతపత్రం ప్రకటించాలి
– రెండేండ్లలో చేసిన అభివృద్ధిని చెప్పి జూబ్లీహిల్స్‌లో ఓట్లడగాలి : మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పరిపాలన చాతగాకుంటే గద్దె దిగిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సీఎం మానసిక స్థితిపై అనుమానాలున్నాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే భయంతోనే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటేసి మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రెండేండ్లలో రేవంత్‌రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటున్నారని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయమని అడిగే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు. ఆయన అప్పుడు కాంగ్రెస్‌లో లేరని గుర్తు చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్నారని చెప్పారు. క్విడ్ ప్రోకో చేసి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ వైఎస్‌పై ఆరోపణలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గంటల కరెంటు కూడా సక్రమంగా వచ్చేది కాదంటూ రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకోవాలనీ, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే జూబ్లీహిల్స్ ప్రజలను ఓట్లడగాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.3,600 కోట్లే ఉన్నాయనడం సరైంది కాదన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా?అని సవాల్ విసిరారు. రూ.ఎనిమిది వేల కోట్లకుపైగా ఫీజు బకాయిలున్నాయని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికలకు ముందు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. పిల్లల చదువులు ముఖ్యమా?, కమీషన్లు ముఖ్యమా?అని అడిగారు. మందిని తొక్కడం, మాట తప్పడం రేవంత్‌రెడ్డి నైజమని అన్నారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయలేదన్నారు. దొంగే దొంగ అన్నట్టుందిగా రేవంత్ రెడ్డి తీరు ఉందని చెప్పారు. కిషన్‌రెడ్డి, రేవంత్ రెడ్డిదే ఫెవికాల్ బంధమని అన్నారు. ఆయనపై ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉందనీ, ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడి చేస్తే ఎందుకు విచారణ జరగడం లేదన్నారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారంటూ ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని అన్నారు. బడేబారుతో చోటేబారుకి బలమైన బంధం ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పెట్టుబడుల కోసం బహుళజాతి సంస్థ్థలు (ఎంఎన్‌సీ) వరుసలో నిలబడితే ఇప్పుడు యూరియా కోసం రైతులు వరుసలో నిలబడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈనెల 11న జూబ్లీహిల్స్ ఓటర్లు వరుసలో నిలబడి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. రెండేండ్లలో చేసిన అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలు గురించి చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, నగేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పాలన చాతగాకుంటే దిగిపో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



