Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్పీకర్‌కు దమ్ముంటే కాలె యాదయ్యపై చర్యలు తీసుకోవాలి

స్పీకర్‌కు దమ్ముంటే కాలె యాదయ్యపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌
గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీపీ విజరుభాస్కర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు దమ్ముంటే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లో ఉన్నానంటూ యాదయ్య చెప్తున్నా స్పీకర్‌కు కనిపించడం లేదు, వినిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా చూడలేకపోతున్నారని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ విజరు భాస్కర్‌ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువాను కప్పి పార్టీలోకి కేటీఆర్‌ ఆహ్వానించారు. ఇచ్చిన మ్యానిఫెస్టోను సీఎం రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కుతున్నారని అన్నారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను పక్కన పెట్టారనీ, పాలనను వదిలేశారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలనూ మోసం చేశారని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్‌ ధృతరాష్ట్రుని లెక్క మారాడనీ, కళ్లకు గంతలు కట్టుకుని నిజాలు చూడలేకపోతున్నారని అన్నారు. కాలె యాదయ్య గెలిపించిన పార్టీని వదిలిపెట్టి పదవుల కోసం, పైసల కోసం కాంగ్రెస్‌లోకి పోయారని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నానంటూ ఆయన చెప్తున్నా స్పీకర్‌ ఒప్పుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే కాలె యాదయ్యపైన చర్యలు తీసుకొని ఎన్నికలకు పోవాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అందర్నీ మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -