నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం గువ్వలోనిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం గేటు ముందు ఉన్న పశువుల నీటి తొట్టి అపరిశుభ్రంగా మారి అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామానికి ఆదర్శంగా ఉండాల్సిన పంచాయతీ కార్యాలయం ముందే నాచుగా పేరుకుపోయి నీరు కలర్ మారటం వల్ల ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.
అదీగాక నేడు గ్రామ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసి ఉండి ఈ దుస్థితి బయటపడడం మరింత చర్చనీయాంశమైంది. ప్రజలకు అభివృద్ధి హామీలు ఇస్తున్న అధికారులు, కనీస పరిశుభ్రతను కూడా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.
నీటి తొట్టిలో నిల్వ నీరు ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి రాత్రి వేళల్లో ఇళ్లపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడదతో అనారోగ్యాలు పెరుగుతున్నా అధికారులకు పట్టడం లేదని విమర్శిస్తున్నారు.
“పంచాయతీ కార్యాలయం ముందే ఈ పరిస్థితి ఉంటే గ్రామం మొత్తం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు” అంటూ బాటసారులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి నిల్వ నీటిని తొలగించి, నీటి తొట్టిని శుభ్రపరచి, పరిసరాల్లో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.



