హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు
కాకుండా ఇతర మతాన్ని అనుసరించే
ఏ వ్యక్తిని ఎస్సీగా పరిగణించలేం
స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
క్రైస్తవంలోకి మారితే వారికి ఎస్సీ హోదా వుండదని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసింది. మతం మారిన వారి ఎస్‌సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. క్రైస్తవంతో సహా మరే ఇతర మతంలోకి మారినా వారు ఎస్‌సీ హోదా ప్రయోజనాలు కోరలేరని పేర్కొంది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తినైనా షెడ్యూల్డ్ కుల సభ్యునిగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ఏ ఇతర మతంలోకి మారినా తక్షణమే, పూర్తిగా షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది.
మంగళవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి అంజారియాలతో కూడిన ధర్మసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో 2025 ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. 1950 నాటి రాజ్యాంగ (ఎస్‌సీ) ఉత్తర్వులో క్లాజు 3ని ప్రస్తావించింది. హిందూ మతానికి భిన్నంగా ఇతర మతాలను అనుసరించే ఏ వ్యక్తినీ ఎస్‌సి సభ్యుడిగా గుర్తించలేమని ఆ క్లాజు పేర్కొంటోంది.”
గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడికి సంబంధించి ఎస్‌సీ, ఎస్‌టీ లైంగికదాడుల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారుడు దశాబ్ద కాలంగా పాస్టర్‌గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని పేర్కొంది. ‘ప్రస్తుత కేసులో, పిటిషనర్ తాను క్రైస్తవ మతం నుంచి తన అసలు మతంలోకి తిరిగి మారానని గానీ, లేదా మాదిగ సమాజంలో తిరిగి కలిసిపోయానని గానీ వాదించడ ం లేదు. దీనికి విరుద్ధంగా, అప్పీలుదారుడు క్రైస్తవ మతాన్ని పాటిస్తూనే ఉన్నాడని, దశాబ్దానికి పైగా గ్రామంలోని ఇళ్లలో క్రమం తప్పకుండా ఆదివార ప్రార్థనలు నిర్వహిస్తూ పాస్టర్‌గా పనిచేస్తున్నాడని సాక్ష్యాధారాలు రుజువు చేస్తున్నాయి. ఆరోపించబడిన సంఘటన జరిగిన సమయంలో, ఆయన ఆ ఇంట్లో ప్రార్థన సమావేశాలు నిర్వహిస్తున్నాడని కూడా అంగీకరించబడింది. ఈ వాస్తవాలు, సంఘటన జరిగిన రోజున ఆయన క్రైస్తవుడిగానే కొనసాగాడనే విషయంలో ఎటువంటి సందేహానికి తావు లేకుండా చేస్తున్నాయి” అని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్. ఎన్.వి అంజారియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఫిర్యాదుదారుడికి తహశీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం వున్నప్పటికీ, మత మార్పిడి తర్వాత ఆ కులం పేరుతో రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారి, ఆ ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేరని స్పష్టం చేసింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని, ఈ ఉత్తర్వులోని నిషేధం సంపూర్ణమైనదని కోర్టు పేర్కొంది. 1950 నాటి ఉత్తర్వులోని క్లాజ్ 3లో పేర్కొనని ఏ మతంలోకి మారినా, పుట్టుకతో సంబంధం లేకుండా తక్షణమే షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద రక్షణ లభించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



