Wednesday, March 25, 2026
E-PAPER
Homeకరీంనగర్తాట్లవాయి అటవీ ప్రాంతంలో టేకు చెట్ల అక్రమ నరికివేత

తాట్లవాయి అటవీ ప్రాంతంలో టేకు చెట్ల అక్రమ నరికివేత

- Advertisement -
  • టేకు దుంగలను పట్టుకున్న వన సంరక్షణ సమితి
  • నవతెలంగాణ – రాయికల్
  • మండలంలోని తాట్లవాయి గ్రామ అటవీ ప్రాంతంలో అక్రమంగా టేకు చెట్లను నరికివేస్తున్నారన్న సమాచారం స్థానిక గ్రామ వన సంరక్షణ సమితికి అందడంతో సభ్యులు వెంటనే అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.అయితే సమితి సభ్యులు అక్కడికి చేరుకున్నట్లు గమనించిన దుండగులు సంఘటన స్థలాన్ని వదిలి పరారయ్యారు. గ్రామస్తుల ప్రకారం,కొంతకాలంగా రాత్రి వేళల్లో అటవీ ప్రాంతంలో టేకు చెట్లను నరికి,వాటిని చిన్న చిన్న దుంగలుగా చేసి వాహనాల్లో గ్రామం నుంచి పట్టణాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఈ అక్రమ రవాణా జరుగుతుండటంతో అటవీ సంపద నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • అటవీ ప్రాంతంలో నరికివేసిన టేకు దుంగలు అక్కడక్కడా కనిపించగా,వాటికి సంబంధించిన వీడియోలు,ఫోటోలు స్థానికులు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారి ప్రజల్లో చర్చనీయాంశంగా నిలిచాయి. గ్రామస్తులు మాట్లాడుతూ.‌. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి గస్తీ పెంచాలని, అక్రమంగా చెట్లు నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అడవులు గ్రామాల జీవనాధారమని,వర్షపాతం, పర్యావరణ సమతౌల్యానికి అవి కీలకమని పేర్కొన్నారు.
  • ఇలాంటి చర్యలు కొనసాగితే భవిష్యత్ తరాలకు అటవీ సంపద దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. టేకు చెట్ల అక్రమ నరికివేత ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ అక్రమంగా నరికివేసిన టేకు కలపను స్వాధీనం చేసుకుని రాయికల్ రేంజ్ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ…అడవుల్లో అక్రమంగా చెట్లు నరికివేయడం,కలపను రవాణా చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో గస్తీ మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు వెల్లడించారు.అటవీ సంపదను కాపాడేందుకు గ్రామస్తులు సహకరించాలని,అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -