Sunday, January 18, 2026
E-PAPER
Homeకరీంనగర్కొత్తపేటలో 4 నెలల క్రితమే అక్రమ టెండర్లు.. విడిసి పాత్రపై తీవ్ర అనుమానాలు

కొత్తపేటలో 4 నెలల క్రితమే అక్రమ టెండర్లు.. విడిసి పాత్రపై తీవ్ర అనుమానాలు

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని కొత్తపేట గ్రామంలో అక్రమ టెండర్ల వ్యవహారం వెనుక విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (విడిసి) కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్రంగా చర్చకు వస్తున్నాయి. సుమారు నాలుగు నెలల క్రితమే ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పక్కనపెట్టి,విడిసి పేరుతో వివిధ వ్యాపారాలకు టెండర్లు నిర్వహించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల సమాచారం మేరకు, విడిసి ఆధ్వర్యంలోనే పెట్రోల్ మరియు కూల్‌డ్రింక్స్ అమ్మకాలకు రూ.1,40,000కు, బెల్ట్ షాప్ నిర్వహణకు రూ.1,70,000కు, గుడుంబా అమ్మకాలకు రూ.70,000కు టెండర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అలాగే చికెన్ విక్రయాలు, ఇసుక అక్రమ రవాణా వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు కూడా టెండర్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వ అనుమతులు, సంబంధిత శాఖల ఉత్తర్వులు లేవన్నది ప్రధాన విమర్శ.

విడిసి నిబంధనల ప్రకారం గ్రామాభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల కోసం మాత్రమే పనిచేయాల్సి ఉండగా,వాణిజ్య కార్యకలాపాలకు-అందులోనూ అక్రమ వ్యాపారాలకు టెండర్లు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా,బహిరంగ ప్రకటనలు జారీ చేయకుండా,కొందరికే లాభాలు చేకూరేలా ఈ టెండర్లు నిర్వహించారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే,ఈ టెండర్ల ద్వారా నగదు రూపంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడం.ఈ నిధులు విడిసి ఖాతాల్లో జమయ్యాయా? లేక వ్యక్తిగతంగా మళ్లించారా?అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానాలు లేవు.విడిసి సభ్యుల పాత్రపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు నెలలుగా అక్రమ టెండర్లు కొనసాగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇప్పుడు మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని హుకుం జారీ చేయడం,అసలు అక్రమాలకు బాధ్యులైన వారిని కాపాడే ప్రయత్నమా? అన్న విమర్శలకు దారి తీసింది.

ఈ వ్యవహారంపై వెంటనే ఉన్నతస్థాయి విచారణ చేపట్టి,విడిసి ద్వారా జరిగిన అక్రమ టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని గ్రామస్థులు,ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన విడిసి సభ్యులు,సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.కొత్తపేటలో విడిసి పేరుతో జరిగిన ఈ అక్రమ టెండర్ల వ్యవహారం చివరికి ఎవరిని బట్టబయలు చేస్తుందో,అధికారుల స్పందన ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -