Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంవిద్యా స్వేచ్ఛకు విఘాతం

విద్యా స్వేచ్ఛకు విఘాతం

- Advertisement -

హిందీ మేధావి ఒర్సినీని
ఢిల్లీ విమానాశ్రయంలో
అడ్డుకున్న అధికారులు
న్యూఢిల్లీ :
దివ్వెల పండుగ మరునాడే చీకటి వార్త వెలుగులోకి వచ్చింది. సరైన వీసా పత్రాలు ఉన్నప్పటికీ ప్రముఖ హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఒర్సినీని ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెనక్కి పంపారు. ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు, గౌరవం పొందిన వ్యక్తి. తన జీవితాన్ని హిందీ భాష, సాహిత్యాన్ని అధ్యయనం చేసేందుకే వెచ్చిస్తున్నారు. లండన్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ (ఎస్‌ఓఏఎస్‌)లో ప్రొఫెసర్‌ ఎమిరిటాగా అనేక సంవత్స రాలుగా పని చేస్తున్నారు. అలాంటి ఓ గౌరవనీయమైన వ్యక్తిని…అందునా సరైన వీసా పత్రాలు ఉన్న మేధావిని భారత్‌లో ప్రవేశించకుండా ఎందుకు అడ్డుకున్నారు? గతంలో ఇలాగే ముగ్గురు విద్యావేత్తలను దేశంలో అడుగు పెట్టకుండా నిరోధించారు. ఒర్సినీ దేశంలో ప్రవేశిస్తే తమకు ముప్పు అని ఎవరు భావిస్తున్నారు?. లోతుగా ఆలోచిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊహాజనిత కథనం ఆధారంగా ఈ చర్యకు పాల్పడిందని అర్థమవుతుంది. విదేశీయులు భారత్‌ గురించి అర్థం పర్థం లేని విషయాలు రాస్తుంటారని, ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వారి రచనలపై ఆంక్షలు విధించే అవకాశం లేనందున ప్రవేశాలను అడ్డుకుంటోంది. ఒర్సినీ రచనలు మున్నెన్నడూ రాజకీయ లేదా విద్యా వివాదాలకు దారితీయలేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర విశ్వవిద్యాలయాలన్నింటికీ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. అదేమిటంటే…ఏదైనా విద్యా సంబంధమైన కార్యక్రమానికి వక్తలను ఆహ్వానించే ముందు వారి జాబితాను సంబంధిత పాలక మండలి పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది.

ఒర్సినీని దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోవడం విద్యా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు చెల్లుబాటయ్యే ఐదు సంవత్సరాల ఈ-వీసా ఉంది. అయినప్పటికీ మంగళవారం తెల్లవారుజామున విమానం నుంచి దిగిన ఆమెను అప్పటికప్పుడే వెనక్కి పంపారు. చైనాలో ఓ విద్యా సదస్సుకు హాజరై హంగ్‌కాంగ్‌ మీదుగా ఆమె న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇక్కడ ఉన్న స్నేహితులను కలుసుకోవాలని ఆమె అనుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో కూడా ఆమె మన దేశంలో పర్యటించారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఒర్సినీ విలేకరులతో మాట్లాడుతూ ‘నన్ను వెనక్కి పంపుతున్నారు. నాకు తెలిసింది అంతే’ అని అన్నారు. తనను తిప్పి పంపడానికి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఎలాంటి కారణాలు చెప్పలేదని తెలిపారు. తిరిగి లండన్‌ వెళ్లిపోవాల్సిందిగా ఆమెకు సూచించారు.

గతంలో ఆంత్రోపాలజిస్ట్‌ ఫిలిప్పో ఒసెల్లా, ఆర్కిటెక్ట్‌ లిండ్సే బ్రెమ్నర్‌, కాశ్మీరీ విద్యావేత్త నిటాషా కౌల్‌ను కూడా దేశంలో ప్రవేశించకుండా బీజేపీ ప్రభుత్వం తిప్పి పంపింది. దేశంలో విద్యా స్వేచ్ఛ క్షీణిస్తోందని చెప్పడానికి ఈ ఘటనలు ఉదాహరణ అని విద్యా సంఘాలు, పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేశాయి. తాజా ఘటనపై చరిత్రకారుడు రామచంద్ర గుహ మండిపడుతూ ‘ఒర్సినీ ప్రముఖ విద్యావేత్త. పండితురాలు. భారతీయ సాంస్కృతిక చరిత్ర గురించి ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవడానికి ఆమె పరిశోధన ఉపకరించింది. పాలకుల్లో నెలకొన్న అభద్రతాభావానికి,మానసిక అపరిపక్వతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది’ అని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -