యుఎస్‌లోని తన కొడుకు వద్దకు వెళ్లినపుడు జయశ్రీ రతన్‌కి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అక్కడ చికిత్స చేయించుకొని తిరిగి భారతదేశానికి వచ్చి ‘సైషా ఇండియా ఫౌండేషన్’ స్థాపించారు. ఇది మహిళలు మాస్టెక్టమీ(రొమ్ము క్యాన్సర్ సోకినపుడు రొమ్మును పూర్తిగా లేదా పాక్షికంగా తీసివేసే చికిత్స) తర్వాత వారిలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. వారికి నచ్చినట్టు జీవించే ఎంపికను తిరిగి పొందడంలో సహాయం చేస్తుంది. ఊలు అల్లికలతో వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
జయశ్రీ రతన్ యుఎస్‌లో ఉన్నప్పుడు ఆమె తన ఖాళీ సమయాన్ని చేతిపనులు చేయడంపై దృష్టి పెట్టారు. క్రోచెటింగ్, అల్లడం, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వంటివి చేసేవారు. ఆమె తయారు చేసిన టవల్స్, దుప్పట్లు వంటివి పిల్లలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. వీటి గురించి మరింత తెలుసుకోవాలనే కోరికతో ఆమె నాకర్స్ వెబ్‌సైట్‌ను పరిశీలించారు. ఇది స్వచ్ఛంద సేవకుల నేతృత్వంలో నడిచే ఎన్‌జీఓ. వీరు ఊలుతో అల్లిన రొమ్ము ప్రొస్థెసెస్‌ను ‘నాకర్స్’ అని పిలుస్తారు. రొమ్ము క్యాన్సర్‌తో మాస్టెక్టమీ లేదా లంపెక్టమీ చేయించుకున్న వ్యక్తులకు వీటిని ఉచితంగా పంపిణీ చేస్తుంది.
జీవితంలో భాగమయింది
‘దీని గురించి మరింతగా తెలుసుకోవాలని చాలా ఆసక్తి కలిగింది. ఎన్నో రోజులు వెదికి సరైన నూలును సేకరించాను. వారి ట్యుటోరియల్స్ నుండి దీనికి సంబంధించిన చేతిపని మొత్తం నేర్చుకున్నాను. ఒక జత నాకర్లను తయారు చేసాను. వారు వాటి నాణ్యతను పరీక్షించి వెంటనే ఆమోదించారు. మాస్టెక్టమీ చేయించుకునే వరకు ఇది నా జీవితంలో ఒక భాగం అవుతుందని నాకు తెలియదు. తను ఇష్టపడే విధంగా ఓ జతను తయారు చేసాను. ప్రాణాలతో బయటపడిన నేను, నాలాంటి వందలాది మందికి కూడా ఇవి అవసరమని గుర్తించాను’ అంటూ జయశ్రీ అంటున్నారు.
విశ్వాసాన్ని పునర్నిర్మిస్తుంది
చాలా మంది మహిళలకు మాస్టెక్టమీ అనేది కేవలం వైద్యం మాత్రమే కాదు. వారి శరీరంలో ఒక భాగం కోల్పోయినపుడు కలిగే భావోద్వేగం, తర్వాత ప్రజాజీవితంలో ఎలా మనగలుగుతారో అనే దానితో ముడిపడి ఉంటుంది. రొమ్ము కోల్పోవడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. దుస్తులు ధరించడానికి ఆటంకంగా ఉంటుంది. ఇది లింగ సాంస్కృతిక అంచనాల మధ్య విశ్వాసాన్ని కూడా పునర్నిర్మిస్తుంది. భారతదేశంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్. మహిళకు వచ్చే అన్ని క్యాన్సర్ కేసులలో దాదాపు నాలుగింట ఒక వంతు ఉంటుంది. రోగ నిర్ధారణ దశను బట్టి మనుగడ గణనీయంగా మారుతుంది. జాతీయ రిజిస్ట్రీ డేటా ఐదేండ్ల మనుగడ రేటును మొత్తం 66% సూచిస్తుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ. వ్యాధిని ముందుగానే గుర్తించినప్పుడు మనుగడ ఎక్కువగా ఉంటుంది. చికిత్స కూడా సులభమవుతుంది.
నలుగురితో మొదలై…
‘క్యాన్సర్ బాధితులకు జీవితంలో ఆత్మవిశ్వాసం అందించటమంటే చాలా విషయాలుంటాయి. వాటిలో ఒకటి వారికి జరిగిన చికిత్స గురించి బహిర్గతం కాకుండా బయట అడుగు పెట్టగలగడం’ అని జయశ్రీ అంటున్నారు. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే 2018లో ఆమె తన పని ప్రారంభించారు. ముంబైకి చెందిన ఛారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి పని చేశారు. ఇది మొదట నలుగురు మహిళలు కలిసి కూర్చొని అల్లిన నాకర్లను (రొమ్ము ప్రొస్థెసెస్‌కు ఒక పదం) తయారు చేయడంతో ప్రారంభమైంది. అప్పటి నుండి దేశంలోని అనేక నగరాలు, విదేశీ కమ్యూనిటీలలో.. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో 400పైగా మహిళా స్వచ్ఛంద సేవకుల నెట్‌వర్క్‌గా అభివృద్ధి చెందింది.
అభ్యర్థనలు ఆగలేదు
‘మా పని ప్రారంభించే ముందు బ్లూప్రింట్ లేదు, నిధుల ప్రణాళిక లేదు, సంస్థాగత మద్దతు లేదు. పని మాత్రమే ఉంది” అని జయశ్రీ చెప్పారు. అతి తక్కువ కాలంలోనే ఆమె సైషాను నిట్టెడ్ నాకర్స్‌తో భారతీయ ప్రొవైడర్‌గా నమోదు చేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటించారు. ఆర్డర్‌ల కోసం కాల్స్ చేయడం ప్రారంభించింది. చాలా సందర్భాల్లో ఎవరిని పిలవాలో కూడా ఆమెకు అస్సలు తెలియదు. ఇందులో వైద్యులు చాలా కీలకమని ఆమె గ్రహించారు. ప్రోస్తేటిక్స్‌తో కలిసిన మొదటి ఆంకాలజిస్ట్‌కు వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ‘దీని గురించి ఎలా చేయాలో నేను అతన్ని అడగాలనుకున్నాను, కానీ నేను ఏమీ మాట్లాడక ముందే అతను నా చేతుల్లోని అల్లిన నాకర్‌లను తీసుకొని, ‘ఇది నా రోగులకు సహాయపడుతుందన్నారు’ అని జయశ్రీ గుర్తు చేసుకున్నారు. ఇక అప్పటి నుండి అభ్యర్థనలు ఆగలేదు. చాలా ఆర్డర్లు వచ్చాయి. అయితే ఆ సమయంలో జయశ్రీ వద్ద నూలు, ఫైబర్, స్వచ్ఛంద సేవకులు కూడా సిద్ధంగా లేరు. కానీ పని చేయాలనే పట్టుదల మాత్రం ఉంది.
మహిళలకు మద్దతు
ఒకప్పుడు స్వచ్ఛంద కార్యకర్తల కోసం ఇబ్బంది పడిన సైషా నేడు 150 మంది స్వచ్ఛంద సేవకులు ఏ సమయంలోనైనా కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా మహిళలకు మద్దతు ఇచ్చారు. దాదాపు 28,000 అల్లిన కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. క్యాన్సర్ చికిత్స పొందుతున్న పిల్లలకు వేలాది టోపీలు కూడా పంపిణీ చేశారు. ‘చికిత్స తర్వాత మహిళలు ఎలాంటి బెరుకూ లేకుండా కేవలం బయటకు రావాలని కోరుకుంటారు’ అని ఆమె అన్నారు. కృత్రిమ అవయవాల కోసం కాల్స్ చేసేవారు సుమారు అరగంట పాటు మాట్లాడుతుంటారు. వారి బిడియం, అప్పటికే నెలల తరబడి ఇళ్ల నుండి బయటకు అడుగు పెట్టకపోవడం, తమ శరీరాలను దాచడం, తమకు మద్దతు ఎలా ఇవ్వాలో తెలియని కుటుంబ సభ్యుల గురించి వీరితో పంచుకుంటారు. కృత్రిమ అవయవాలు ధరించి ఆత్మవిశ్వాసంతో తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.



