Friday, January 30, 2026
E-PAPER
Homeకరీంనగర్బీ-ఫామ్ ఎవరి చేతిలోకి.?

బీ-ఫామ్ ఎవరి చేతిలోకి.?

- Advertisement -

రాయికల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌లో రెడ్డి వర్గం వర్సెస్ రావు వర్గం
నామినేషన్ల చివరి రోజు.. ఆశావహుల్లో పెరిగిన టెన్షన్
నవతెలంగాణ – రాయికల్

రాయికల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుండటంతో పట్టణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల్లో బీ-ఫామ్ ఎవరి చేతికి చేరుతుందన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ తారస్థాయికి చేరింది. నామినేషన్ల చివరి రోజున రాయికల్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. సమయం తక్కువగా ఉండటంతో కాంగ్రెస్,బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన ఆశావహులు తమ మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పార్టీ తరపున బీ-ఫామ్ వస్తుందన్న ఆశతో నామినేషన్లు వేస్తూనే, చివరి నిమిషంలో టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో వర్గపోరు ఉధృతం..
రాయికల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం వర్సెస్ రావు వర్గం మధ్య పోరు బహిరంగంగానే కొనసాగుతోంది.ఎవరు బీ-ఫామ్ పొందుతారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఒక్కో వార్డులో ఒకే పార్టీ నుంచి ముగ్గురు నుంచి నలుగురు వరకు నామినేషన్లు దాఖలవుతున్నాయి. బయటకు ధీమాగా మాట్లాడుతున్నప్పటికీ,లోలోపల మాత్రం టికెట్ దక్కుతుందా? లేదా? అన్న ఆందోళన ఆశావహుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే ఎలాంటి ఎన్నికల గుర్తు లేకుండానే ప్రచారాన్ని ప్రారంభించారు.తమకు ఎమ్మెల్యే మద్దతు ఉందని కొందరు ప్రచారం చేస్తుండగా,మరికొందరు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆశీస్సులు తమకే ఉన్నాయని చెప్పుకుంటున్నారు.ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత లోతుగా ఉన్నాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

గెలుపు గుర్రాలే లక్ష్యం..
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉండి,వార్డుల్లో ప్రభావం చూపగల అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలో ఆర్థికంగా బలమైన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ,అవసరమైతే చైర్మన్ పదవికీ హామీ ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎవరికీ లాభం..? ఎవరికీ నష్టం..?
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గపోరు రాయికల్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది.ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది బరిలో ఉండడం,పరస్పర ఆరోపణలు,బహిరంగ ప్రచారాలు కాంగ్రెస్ క్యాడర్‌ను అయోమయంలోకి నెట్టుతున్నాయి.ఈ పరిస్థితి ఓటర్లలోనూ గందరగోళం సృష్టించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వర్గపోరే బీఆర్ఎస్ పార్టీకి లైన్ క్లియర్ చేస్తున్న ప్రధాన అంశంగా మారుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడం,అభ్యర్థుల ఎంపికలో జాప్యం బీఆర్ఎస్‌కు రాజకీయంగా అనుకూలంగా మారే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ క్యాడర్ ఒకే దిశగా కదిలితే రాయికల్ మున్సిపాలిటీలో ఆధిపత్యం సాధించే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

మరోవైపు బీజేపీ పార్టీకి కూడా ఈ పరిస్థితి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు,బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని బీజేపీ రెండు లేదా మూడు కౌన్సిలర్ స్థానాలను దక్కించుకునే అవకాశముందని స్థానికంగా చర్చ జరుగుతోంది.పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న పరిమితమైన కానీ స్థిరమైన ఓటు బ్యాంక్ ఈసారి ఫలితాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇండిపెండెంట్ల పాత్ర కీలకమా?
టికెట్ దక్కని ఆశావహులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగితే ఓటు చీలిక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఇండిపెండెంట్లు ఎక్కువ సంఖ్యలో బరిలో నిలిస్తే, ఆ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశముందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితి ప్రత్యర్థి పార్టీలకు ప్రత్యక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది.

చివరి నిమిషంలో నిర్ణయాలే కీలకం
బీ-ఫామ్ పంపిణీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు ఉత్కంఠ కొనసాగనుంది.చివరి నిమిషంలో పార్టీలు తీసుకునే నిర్ణయాలు,వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలే ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తానికి రాయికల్ మున్సిపాలిటీలో
బీ-ఫామ్ అనిశ్చితి,కాంగ్రెస్‌లో తీవ్ర వర్గపోరు,ఇండిపెండెంట్ బెదిరింపులు,ప్రత్యర్థి పార్టీలకు పెరుగుతున్న అవకాశాలు అన్నీ కలిసి ఈ ఎన్నికలను అత్యంత ఉత్కంఠభరితంగా మార్చాయి. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలే రాయికల్ మున్సిపల్ రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -