Wednesday, March 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

- Advertisement -

18,139 మెగావాట్ల గరిష్ట స్థాయికి చేరిక : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌), ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం 11:01 గంటలకు 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ నమోదైందన్నారు. డిమాండ్‌ పెరిగినా వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా సరఫరా చేశామని చెప్పారు. ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను అధిగమించే స్థాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. పంజాబ్‌, హర్యానా, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ డిమాండ్‌ను అధిగమించడం పట్ల ఆయన విద్యుత్‌ సంస్థలకు అభినందనలు తెలిపారు. ”తెలంగాణ కేవలం సమకాలీన అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, రాబోయే వేసవి గరిష్ట డిమాండ్‌ను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. బలమైన గ్రిడ్‌ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ మన బలం” అని భట్టి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -