అమెరికాకు రెట్టింపు కంటే అధికం
న్యూఢిల్లీ : గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో మన దేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 39 శాతం పెరిగాయి. గతేడాది ఆగస్టులో 1.09 బిలియన్ డాలర్ల విలువ గల స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి కాగా గత నెలలో 1.53 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరిగాయని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు రెట్టింపు కంటే పెరగడం గమనార్హం. అవి 388 బిలియన్ డాలర్ల నుంచి 965 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే 148 శాతం పెరుగుదల నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయలకు (11.7 బిలియన్ డాలర్లు) చేరాయి.
గత ఐదేండ్ల కాలంలో స్మార్ట్‌ఫోన్లు భారత ఎగుమతుల విభాగంలో కీలక పాత్ర పోషించాయని ఐసీఈఏ వివరించింది. ఉత్పత్తి ఆధారిత రాయితీ (పీఎల్‌ఐ) పథకం దీనికి ఊతమిచ్చింది. అమెరికాకు స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసే విషయంలో ఈ ఏడాది ప్రారంభంలో చైనాను భారత్ అధిగమించింది. మేక్ ఇన్ ఇండియా, పీఎల్‌ఐ పథకం వంటి విధానపరమైన చర్యలు ఈ పరిణామానికి కారణమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చెబుతోంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో అమెరికా స్మార్ట్‌ఫోన్ దిగుమతుల్లో భారత్ వాటా 44 శాతానికి పెరిగింది. గతేడాది ఇదే కాలంలో ఇది కేవలం 13 శాతంగానే ఉంది. అదే సమయంలో చైనా వాటా 61 శాతం నుంచి 25 శాతానికి తగ్గిపోయింది.