Friday, September 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌ ఓ డ్రగ్స్‌ ఉత్పత్తి కేంద్రం

భారత్‌ ఓ డ్రగ్స్‌ ఉత్పత్తి కేంద్రం

- Advertisement -

ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్‌ రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్‌ ఆరోపణ
అమెరికా ప్రజల భద్రతకు ముప్పు అంటూ వ్యాఖ్య

న్యూయార్క్‌ : భారత్‌ డ్రగ్స్‌కు ఉత్పత్తి కేంద్రమనీ, డ్రగ్స్‌ రవాణా స్థావరాలుగా భారత్‌ సహా 23 దేశాలు వ్యవహరిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. అఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌, చైనాలు ఈ జాబితా లో ఉన్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌ అందులో ఉపయోగించే రసాయనాలను ఇవి ఉత్పత్తి చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా మారాయని విమర్శించారు. అమెరికన్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన ‘ప్రెసిడెన్షియల్‌ డిటర్మినేషన్‌’ నివేదికలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ జాబితాలో భారత్‌, పాకిస్తాన్‌, చైనా, అఫ్గానిస్థాన్‌, ద బహమాస్‌, బెలీజ్‌, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, ద డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వెడార్‌, ఎల్‌ సాల్వడార్‌, గ్వాటెమాలా, హైతీ, హౌండురస్‌, జమైకా, లావోస్‌, మెక్సికో, నికరాగువ, పనామా, పెరూ, వెెనిజులా దేశాలు ఉన్నాయి.

ఇవి ప్రధానంగా డ్రగ్స్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు రవాణా చేస్తున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ 23 దేశాలు అక్రమ మాదక ద్రవ్యాలను అమెరికాలోకి రవాణా, ఉత్పత్తి చేయడానికి బాధ్యులుగా గుర్తించామని వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే స్టేట్‌ డిపార్ట్మెంట్‌ ఈ 23 దేశాల అధ్యక్ష నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఐదు దేశాలు అఫ్గానిస్థాన్‌, బోలీవియా,బర్మా, కొలంబియా, వెనిజులా గత 12 నెలల్లో మాదకద్రవ్యాలపై చర్యలు తీసుకోడంలో విఫలమయ్యాయని పేర్కొంది. ఈ దేశాలు తమ మాదక ద్రవ్య నిరోధక ప్రయత్నాలను మెరుగుపరుచుకోవాలని అభ్యర్థించింది.

డ్రగ్స్‌ను అరికట్టడంలో విఫలం
మాదక ద్రవ్యాలను అరికట్టడం, వాటిని ప్రేరేపిస్తున్న నేరస్థులను అదుపు చేయడంలో మరింత బలమైన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. మరో పక్క చైనా నాయకత్వం గురించి ఆయన ప్రస్తావించారు. నైటాజీన్లు, మెథాంఫేటమిన్‌ వంటి ఇతర సింథటిక్‌ మాదకద్రవ్యాలను ప్రపంచ వ్యాప్తంగా రవాణా చేస్తున్న ప్రధాన సరఫరాదారు చైనా అని తెలిపారు.

డ్రగ్స్‌ సరఫరాతో లాభం..
తాలిబాన్‌ డ్రగ్స్‌ నిషేధాన్ని ప్రకటించినప్పటికీ మాదకద్రవ్య నిల్వలు, ఇంకా ఉత్పత్తి కొనసాగుతూనే ఉన్నాయని, ఇందులో మిథాంఫెటమిన్‌ ఉత్పత్తి విస్తరిస్తోందని డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ మాదకద్రవ్య వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం ట్రాన్సేషనల్‌ క్రిమినల్‌ గ్రూప్స్‌ను ఫండింగ్‌ చేస్తూ అంతర్జాతీయ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. తాలిబాన్‌ సభ్యులు ఈ వ్యాపారంలో లాభం పొందుతూనే ఉన్నారని, తాను మళ్లీ ఒకసారి అఫ్గానిస్తాన్‌ను అక్రమ మాదక ద్రవ్య నియంత్రణ చర్యలు పాటించడంలో విఫలమైన దేశంగా ప్రకటిస్తున్నానని ట్రంప్‌ తెలిపారు. అఫ్గనిస్తాన్‌లోని వైమానిక స్థావరాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఉందని చెప్పారు.

డ్రగ్స్‌ రవాణాతో జాతీయ అత్యవసర పరిస్థితి
అంతర్జాతీయ వ్యవస్థీకత నేరాల ద్వారా ఫెంటానిల్‌, ఇతర ప్రాణాంతక నిషేధిత మాదకద్రవ్యాలను అమెరికాలోకి రవాణా చేయడం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని ట్రంప్‌ తెలిపారు. అదే విధంగా 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల అమెరికన్‌ పౌరుల మరణానికి ప్రధాన కారణం ప్రజారోగ్య సంక్షోభం కూడా అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -