Thursday, March 26, 2026
E-PAPER
Homeజాతీయంతీవ్ర సంక్షోభం అంచున భారత్‌

తీవ్ర సంక్షోభం అంచున భారత్‌

- Advertisement -

పొంచి ఉన్న 2008 నాటి గండం
బెర్న్‌స్టెయిన్‌ హెచ్చరిక
మార్కెట్లు మరింత పతనమే : యూబీఎస్‌

న్యూఢిల్లీ : భారత్‌ ఒక భయంకరమైన ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థలు బెర్న్‌స్టెయిన్‌, యూబీఎస్‌లు వేరు వేరు రిపోర్టుల్లో హెచ్చరించాయి. పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన యుద్ధం భారత్‌పై తీవ్ర ప్రతికూలతను చూపనున్నాయని వెల్లడించాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే భారత్‌ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

గత దశాబ్ద కాలంగా తక్కువ చమురు ధరల వల్ల లభించిన ఆర్థిక మద్దతు ఇప్పుడు పూర్తిగా బలహీనపడిందని వాల్‌స్ట్రీట్‌లోని బెర్న్‌స్టెయిన్‌ తెలిపింది. యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగితే భారత వృద్ధి రేటు 2-3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. బెర్న్‌స్టెయిన్‌ రిపోర్ట్‌ ప్రకారం..జీడీపీ పడిపోతే ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నట్లే. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం 10 శాతం మార్కును దాటే అవకాశం ఉంది. ఇది ఆర్‌బీఐ కట్టడి లక్ష్యానికంటే చాలా ఎక్కువ. ధరలు పెరిగితే సామాన్యుడిపై తీవ్ర భారం పడుతుందని నివేదిక హెచ్చరించింది.

రూపాయి విలువ 110కి పడిపోవచ్చు..
భారత కరెన్సీ విలువ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా డాలర్‌తో పోలిస్తే 110 స్థాయికి పడిపోయే ముప్పు పొంచి ఉందని బెర్న్‌స్టెయిన్‌ వెల్లడించింది. ‘దేశ విదేశీ మారక నిల్వలు కాగితం మీద బలంగా కనిపిస్తున్నప్పటికీ అందులో తక్షణమే వినియోగించగలిగే నగదు ఆస్తులు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నిల్వల్లో ఎక్కువ భాగం బంగారం రూపంలో ఉండటంతో.. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి డాలర్ల లభ్యత తక్కువగా ఉంది. దీనికి తోడు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే నిధులు తగ్గడం మరోవైపు పెరిగిన చమురు బిల్లుల వల్ల కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ) జీడీపీలో 2.5 శాతానికి చేరనుంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయనుంది.” అని బెర్న్‌స్టెయిన్‌ హెచ్చరించింది.

19వేల దిగువకు నిఫ్టీ..!
యుద్ధం, అధిక వడ్డీ రేట్ల కారణంగా నిఫ్టీ భారీ పతనాన్ని చవి చూడనుందని బెర్న్‌స్టెయిన్‌ అంచనా వేసింది. నిఫ్టీ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో 19,000 పాయింట్ల దిగువకు పడిపోవచ్చని విశ్లేషించింది. ఇప్పటికే ఈ ఏడాది 12 శాతం క్షీణించిన విషయాన్ని గుర్తు చేసింది. మరిన్ని నష్టాలను చవిచూసే అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు మార్కెట్లకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని సూచించింది. చమురు సెగకు తోడు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి ఆహార ధరలు పెరిగితే.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి కనీసం 3-4 ఏండ్ల వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషించింది.

ఇంధన గండం : యూబీఎస్‌
పశ్చిమాసియాలో యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించడంతో భారత ఇంధన భద్రతకు పెను ముప్పు పొంచి యూబీఎస్‌ హెచ్చరించింది. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 43 శాతం, ఎల్‌ఎన్‌జీ కోసం ఏకంగా 63 శాతం కేవలం హార్ముజ్‌ జలసంధిపైనే ఆధారపడటం ఇప్పుడు దేశానికి అతిపెద్ద బలహీనతగా మారిందని తెలిపింది. ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గ్యాస్‌ కొరతతో ఇప్పటికే 60 శాతం హోటళ్లు మూతపడటానికి దారితీయగా, మున్ముందు పారిశ్రామిక ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -