విదేశాంగ మంత్రి జైశంకర్
ఇతరులు మనల్ని నిర్దేశించలేరంటూ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : గత ఏడెనిమిది దశాబ్దాల్లో భారత్-రష్యా భాగస్వామ్యం ‘అత్యంత సుస్థిరంగా కొనసాగుతున్న అతిపెద్ద సంబంధాల్లో ఒకటి’ అని విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యానించారు. ఆర్థిక సంబంధాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ పుతిన్ ప్రస్తుత భారత్ పర్యటన సాగిందని చెప్పారు. ఇక్కడ జరిగిన ఒక మీడియా సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ చర్చలు సాగుతున్న వేళ పుతిన్ పర్యటన మరిన్ని ఇబ్బందులు కలగచేయగలదన్న అభిప్రాయాలతో ఆయన ఏకీభవించలేదు. ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలతో భారత్‌కు సత్సంబంధాలున్నాయని ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. ఇతర దేశాలతో మనం సంబంధాలు ఎలా వృద్ధి చేసుకోవాలో చెప్పాలని ఏ దేశమైనా మనకు చెప్పాలనుకోవడం సహేతుకమైన ప్రతిపాదన కాదని ఆయన వ్యాఖ్యానించారు.
”ఇతరులు కూడా ఇదే ఊహించుకోవచ్చు, కానీ మనకు అనేక సంబంధాలుంటాయి, వాటిలో ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛ మనకు వుంటుంది. ఈ విషయం మనం ఎల్లప్పుడూ స్పష్టం చేస్తూనే వచ్చాం.” అని జైశంకర్ తేల్చి చెప్పారు. భారత్ వంటి పెద్ద దేశానికి సాధ్యమైనంత మందితో మంచి సహకారాన్ని, సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యమని అన్నారు. భారత్, రష్యా సంబంధాలు గత 70, 80 సంవత్సరాల్లో ఈ ప్రపంచం అనేక ఎత్తుపల్లాలను చూసింది, కానీ రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించినంతవరకు అవి అత్యంత సుస్థిరంగా సాగాయని చెప్పారు. అనేక దేశాలతో మన సంబంధాలు ఇలాగే ఉంటాయన్నారు.
భారత్-రష్యా భాగస్వామ్యం అత్యంత సుస్థిరం !
- Advertisement -
- Advertisement -



