Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంపట్టణ ప్రజల్లో అసమానతలు

పట్టణ ప్రజల్లో అసమానతలు

- Advertisement -

– వారిపై కులం, మతం, తరగతి ఎఫెక్ట్‌
– వాటి ఆధారంగానే ఏదైనా..
– పలు రంగాల్లో పౌరులను నిరోధిస్తున్న పరిస్థితులు : సీఐయూజీ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : ‘పౌరసత్వం, అసమానత, పట్టణ పాలన (సీఐయూజీ)’ అనేది భారత్‌లోని పరిశోధకులు, బ్రౌన్‌ విశ్వవిద్యాలయం మధ్య ఒక సహకార ప్రాజెక్టు. ఇది 14 నగరాల్లో 31,803 ఇండ్లను సర్వే చేసింది. తరగతి, కులం, మతం వంటివి పౌరులు, ప్రజాసేవలను, రాజకీయ భాగస్వామ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో కను గొన్నది. ఈ అధ్యయనం పట్టణ ప్రాంత భారతీయులు ఎలా జీవిస్తున్నారు? ఎలా ఓటు వేస్తారు? నమోదులో ఉన్న అంతరాలు ఏమిటి? నీరు, పారిశుధ్యం వంటి ముఖ్యమైన సేవలను ఎలా పొందుతున్నారు? అనే విషయాలపై చర్చించింది. పట్టణ ప్రాంత ప్రజలను కట్టడి చేస్తున్న తీరును వివరించింది.

భారత్‌లోని పెద్ద నగరాల్లో అనధికార గృహాల (అనుమతులు లేని ఇండ్లు, గుడిసెలు వంటివి) సంఖ్య అధికంగా ఉన్నాయి. ఇలాంటి ఇండ్లలో నివసించే జనాభా దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో అత్యధికంగా 62 శాతంగా ఉన్నది. ఇది కొచ్చిలో 1.4 శాతమే. భోపాల్‌ మినహా ప్రతి నగరంలో గుడిసెలు, మురికివాడల గృహాలలో బహిష్కరణ, తరలింపు భయాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ అంశాలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కోల్‌కతాలో గృహాల నుంచి బహిష్కరణ, తరలింపు భయాలు తక్కువ. జలంధర్‌లోని అనధికారిక గృహాలలో సగానికి పైగా ఇండ్లు అభద్రతలో ఉన్నాయి. ఇలాంటి గృహాలలో ఎస్సీ, ఎస్టీలు భారీ సమూహంగా ఉన్నారు. ఎస్సీలు 45 శాతం మంది, ఎస్టీలు 37 శాతానికి పైగా, ఓబీసీలు 25 శాతం మంది ఉన్నారు. ఇక జనరల్‌ కులాల నుంచి 25 శాతం మంది నివసిస్తున్నారు. ఇక ఉన్నత తరగతి గృహాలలో ఇతర కులాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలు చాలా తక్కువగా ఉన్నారు. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాతో సహా మెజారిటీ నగరాల్లో కులాల వారీగా గృహ విభజన స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రామాల్లో దళితులు వివక్షను ఎదుర్కొనే అవకాశాలు, సందర్భాలు ఎక్కువగా ఉంటాయని అంతా చెప్తుంటారు. అయితే పట్టణ ప్రాంతాల్లోనూ ఆ జాఢ్యం ఉన్నదని తాజా అధ్యయనం వివరిస్తున్నది.

ఇక ఓటరు నమోదులో కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. ముంబయి, జలంధర్‌, హైదరాబాద్‌ అనే మూడు నగరాల్లోని అనధికార గృహాల్లో 50 శాతం కంటే తక్కువ మంది ఓటు నమోదు చేసుకున్నారు. ఇక ఉన్నత తరగతి గృహాల నుంచి ఓటు నమోదు చేసుకున్నవారి సంఖ్య 74 శాతంగా ఉన్నది. అనధికారిక గృహాలలో సగానికిపైగా వలస వచ్చినవారే ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు. ఉన్నత తరగతి గృహాలలో దీర్ఘకాలిక నివాసితులు, స్థానికులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

మతపరమైన తేడాలు
దేశంలో మైనారిటీలు ఇలాంటి సేవా లోటును ఎదుర్కొంటున్నారు. ముస్లింలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నది. 14 నగరాల్లోని పది నగరాల్లో ముస్లింలు అనధికారిక స్థావరాలలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఉన్నత తరగతి గృహాలలో వారి ప్రాతినిథ్యం తక్కువగా ఉన్నది. కొచ్చి, చెన్నై, భోపాల్‌, ఢిల్లీలో మాత్రం పరిస్థితులు కాస్త పర్వా లేదనిపించాయి. రాజకీయంగా ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారు. మత శక్తులకు వీరు తరచూ టార్గెట్‌ అవుతున్నారు.

గణనీయమైన అసమానతలు
దిగువ, ఉన్నత తరగతి ఆధారంగా కూడా పట్టణ ప్రాంత ప్రజలకు అందే సేవల్లో గణనీయమైన అసమానతలు ఉన్నాయి. నీటి సరఫరా, పారిశుధ్య సేవల విషయంలో భావ్‌నగర్‌, కొచ్చి, వడోదరలు ఉత్తమంగా పని చేస్తున్నాయి. చెన్నై, ముంబయి మాత్రం వెనుకబడి ఉండటం గమనార్హం. దిగువ తరగతి కుటుంబాలు నీటి నిల్వ కోసం బకెట్లపై ఆధారపడుతున్నాయి. పారిశుధ్యం విషయంలో కొచ్చి, వడోదర, అహ్మదాబాద్‌, ఢిల్లీలు సాపేక్షంగా బాగా పని చేస్తున్నాయి. ముంబయి అధ్వానస్థితిలో ఉన్నది. అన్ని నగరాల్లోనూ అనధికారిక గృహాలలో ఉన్నవారు అత్యంత అధ్వాన పారిశుధ్య నాణ్యతను కలిగి ఉన్నారు. 90 శాతం కంటే ఎక్కువ అనధికారిక గృహాలలో తగినంత పారిశు ధ్యం అందుబాటులో లేదు. పారిశుధ్య సేవలు పొందే విషయంలో కులం, మతం కంటే తరగతి కీలక పాత్ర పోషిస్తున్నది.

కులం, మతం ఆధారంగా సంబంధాలు
భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ కులం, మతం ఆధారంగానే ప్రజలు తమ సంబంధాలను నెరుపుతున్నారు. చెన్నై, కొచ్చి మాత్రం ఈ జాఢ్యం నుంచి కొంత వరకు దూరంగానే ఉన్నాయి. మతాంతర సంబంధాల విషయంలో కొన్ని చిన్న నగరాలు మాత్రమే పర్వాలేదనిపిస్తున్నాయి. ఇక అత్యంత సామాజికంగా దీనమైన నగరాల్లో ఢిల్లీ ఉండటం గమనార్హం. ఇక్కడ సమూహాల మధ్య సామాజిక సంబంధాలు చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించబడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -